Ebola Patients : ఆఫ్రికా ఖండంలోని కాంగో దేశంలో ఎబోలా వైరస్ (Ebola Virus) విజృంభిస్తున్నది. ఈ క్రమంలో ఎబోలా సోకిన 11 మంది పేషెంట్లు ఐసోలేషన్ కేంద్రాల నుంచి పరారవడం ఆందోళనలు రేకెత్తించింది. ఇదిలావుంటే ఎబోలా వ్యాధితో మృతిచెందిన వారిని ఖననం చేసే బృందం (Burial Team) పై కటానా పట్టణంలో మూక దాడి జరిగింది. దక్షిణ కివులోని కటానా పట్టణంలో ఎబోలాతో చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు చేస్తున్న బృందంపై కొందరు మూక దాడి చేశారు. దీంతో ఆ మృతదేహాన్ని అక్కడే వదిలేసి ఆ బృందం పారిపోయింది.
దీంతో స్థానికులే అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. దీనివల్ల వైరస్ మరింత వేగంగా వ్యాప్తిచెందే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇక ఇటూరిలో ఉన్న ఐసోలేషన్ కేంద్రాల నుంచి 11 మంది ఎబోలా రోగులు పారిపోయారు. అదే సమయంలో కొన్ని ప్రావిన్స్‌లలో సాయుధ మూకలు మానవతా సాయానికి ఆటంకం కలిగిస్తున్నాయి. దాంతో అక్కడి భద్రతా పరిస్థితులపై ఆందోళనలు నెలకొన్నాయి. కాంగో జాతీయ ప్రజారోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. దేశంలో ఇప్పటివరకు 363 ఎబోలా కేసులు నమోదయ్యాయి.
బుండిబుగ్యో వైరస్ కారణంగా 62 మంది మరణించారు. వ్యాధి సోకిన వారిని కనుగొనడంలో కొంత మెరుగుదల కన్పించినట్లు అధికారులు తెలిపారు. ఉగాండాలో కూడా 15 కేసులు నిర్ధరణ కాగా.. ఒక మరణం సంభవించింది. ఆఫ్రికా దేశాల్లో ఎబోలా కేసులు పెరుగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు అప్రమత్తమయ్యాయి. ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను స్క్రీనింగ్ చేస్తూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.