Continents | లండన్ : ప్రపంచంలో ఉన్న ఖండాలెన్ని అని అడిగితే ఠక్కున ఏడు అని అందరూ సమాధానం చెబుతారు. కానీ, భవిష్యత్తులో ఆరు అని చెప్పాల్సి రావచ్చు. ఎందుకంటే, ప్రపంచంలో ఉన్న ఖండాలు ఏడు కాదు, ఆరు మాత్రమేనని బ్రిటన్‌కు చెందిన ఓ యూనివర్సిటీ పరిశోధకులు ప్రతిపాదించారు. యూనివర్సిటీ ఆఫ్ డెర్బీకి చెందిన ఎన్విరాన్మెంటల్ సైన్స్ విభాగం పరిశోధకులు ఈ మేరకు తమ అధ్యయనంలో కనుగొన్నట్టు వెల్లడించారు. అట్లాంటిక్ మహాసముద్రం కింది భాగంలో టెక్టోనిక్ ప్లేట్ల ద్వారా ఇప్పటికీ ఉత్తర అమెరికా, యూరేషియా (యూరప్+ఆసియా) అనుసంధానమై ఉన్నాయని పరిశోధకులు ప్రతిపాదించారు.
ప్రధానంగా ఐస్లాండ్ భౌగోళిక స్థితిగతులపై ఈ అధ్యయనం దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఈ కీలకమైన విషయం వెల్లడైంది. తమ అధ్యయనంలో భౌగోళిక లక్షణాలు కలిగిన రిఫ్టెడ్ ఓషియన్ మాగ్మాటిక్ ప్లాటో (పీఠభూమి)ని పరిశోధకులు గుర్తించారు. అది సముద్ర అంతర్భాగంలో దాగి ఉన్న ఉపఖండాన్ని సూచిస్తున్నదని పరిశోధకులు భావిస్తున్నారు. ఐస్లాండ్, గ్రీన్లాండ్-ఐస్లాండ్-ఫారోస్ రిడ్జ్ కలిసి ఉత్తర అమెరికా, యూరప్‌లను అనుసంధానం చేసే భారీ నిర్మాణాన్ని ఏర్పరుస్తున్నట్టు పరిశోధకులు భావిస్తున్నారు. ఈ పరిశోధనలు నిజమైతే ఖండాల భౌగోళిక స్థితిగతులను పునర్నిర్వచించడంతో పాటు ప్రపంచ మ్యాప్‌నే మార్చేస్తుంది.