Cigarette | లండన్, డిసెంబర్ 30: ఒక సిగరెట్ తాగితే సగటున 20 నిమిషాల ఆయుర్దాయం కోల్పోతారని తాజా అధ్యయనం హెచ్చరించింది. పురుషులైతే 17 నిమిషాలు, మహిళలైతే 22 నిమిషాల జీవిత కాలాన్ని కోల్పోతారని యూనివర్సిటీ కాలేజ్ లండన్ తాజా అధ్యయనం తెలిపింది. ఈ నేపథ్యంలో పొగతాగేవారు అనారోగ్యకరమైన ఈ అలవాటు వీడటం ద్వారా కొత్త ఏడాదికి శ్రీకారం చుట్టాలని పరిశోధకులు సూచించారు. గత అధ్యయనాల కన్నా తాజా అధ్యయనం ధూమపానం వల్ల నష్టపోయే జీవిత కాలం ఎక్కువని తేల్చడం గమనార్హం.
సుమారుగా 20 సిగరెట్లున్న ఒక ప్యాకెట్‌ను ఒక రోజులో తాగి పడేస్తే సుమారుగా ఏడు గంటల జీవిత కాలం తగ్గుతుందని అధ్యయనం తెలిపింది. జీవిత కాలం పూర్తిగా మెరుగుపడాలని ఆశించే వారు ధూమపానాన్ని పూర్తిగా మానేయాలని అధ్యయనం సూచించింది. ధూమపానం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 80 లక్షల మంది మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.