న్యూయార్క్: ఇటీవల యాంటీబయోటిక్ల వినియోగం ఎక్కువైంది. అయితే వాటి వాడకం వల్ల రోగ నిరోధక శక్తి నశిస్తున్నది. యాంటీబయోటిక్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్ల(Antibiotic-Resistant Infections) వల్ల 2050 నాటికి సుమారు 4 కోట్ల మంది మరణించే అవకాశాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ద లాన్సెట్లో దీనికి సంబంధించిన రిపోర్టును పబ్లిష్ చేశారు. ప్రస్తుతం యాంటీబయోటిక్ల వాడకం పెరిగిందని, రాబోయే దశాబ్ధాల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నదని, దీంతో మరణాల సంఖ్య కూడా పెరిగే ఛాన్స్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన హెల్త్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ క్రిస్టోఫర్ జేఎల్ ముర్రే రిపోర్టును తయారు చేశారు. సమస్య చాలా తీవ్రంగా ఉందని ఆయన తన నివేదికలో పేర్కొన్నారు.
యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ ఇన్ఫెక్షన్ల వల్ల సాధారణ రోగాలను నయం చేయడం కష్టంగా మారుతోందని, దీంతో వైద్య విధానం రిస్కీగా మారినట్లు పరిశోధకులు పేర్కొన్నారు. వృద్ధులు ఏఎంఆర్ మరణాలకు బలవుతున్నట్లు తెలిపారు. వాళ్లకు ఇన్ఫెక్షన్ రేటు అధికంగా ఉన్నట్లు చెప్పారు. 52 కోట్ల డేటా పాయింట్లను స్టడీ చేశారు. డిస్చార్జ్ రికార్డులు, ఇన్సూరెన్స్, డెత్ సర్టిఫికేట్ల ఆధారంగా 204 దేశాల్లో స్టడీ నిర్వహించారు. యాంటీ మైక్రోబియల్ రెసిస్టాన్స్ మృతుల సంఖ్య రోజు రోజుకూ పెరిగే అవకాశాలు ఉన్నట్లు రిపోర్టులో అభిప్రాయపడ్డారు.
రాబోయే 25 ఏళ్లలో 3.9 కోట్ల మంది మరణిస్తారని, ఇది సగటున నిమిషానికి మూడు మరణాలు అవుతుందని లాస్ ఏంజిల్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కెవిన్ ఇకుటా స్టడీలో తెలిపారు. 1990 నుంచి 2001 మధ్య కాలంలో అయిదేళ్ల చిన్నారుల్లో ఏఎంఆర్ మరణాలు 50 శాతం తగ్గిపోగా, 70 ఏళ్లు దాటిన వారిలో 80 శాతం మరణాలు పెరిగినట్లు అధ్యయనంలో అంచనా వేశారు. 2050 నాటికి పిల్లల్లో ఏఎంఆర్ మరణాలు తగ్గిపోగా, వృద్ధుల్లో మాత్రం రెండింతలు పెరగనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఏఎంఆర్ మరణాల్లో దక్షిణాసియాలోనే 1.2 కోట్ల మంది మరణించే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేశారు.
బ్యాక్టీరియా రెసిస్టెన్స్ అంశంలో.. యాంటీబయోటిక్ల వినియోగాన్ని పెంచడమో లేక తప్పుగా వాడడం వల్ల అనర్ధాలు జరిగే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు.