దుబాయ్ : ‘సిటీ ఆఫ్ గోల్డ్’గా దుబాయ్ ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో అతి పెద్ద గోల్డ్ మార్కెట్లలో ఒకటైన దుబాయ్ గోల్డ్ సౌక్ ఇక్కడే ఉంది. బంగారం, ఆభరణాలకు అంతర్జాతీయ కేంద్రంగా దుబాయ్ కీర్తిప్రతిష్ఠలను మరింత పెంచే లక్ష్యంతో కొత్తగా దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్‌ను నిర్మిస్తున్నారు. దీనిలో భాగంగా బంగారు వీధి, బంగారు రోడ్డులను నిర్మించబోతున్నారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ గోల్డ్ స్ట్రీట్‌ను సందర్శకులు, పర్యాటకులు సందర్శించవచ్చు. వీటి ప్రణాళికలు, డిజైన్లు, ప్రాంతాల గురించి దశల వారీగా వెల్లడిస్తారు.
దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్‌ను ప్రాపర్టీ డెవలపర్ ఇత్రా దుబాయ్ ప్రకటించింది. దీనిలో భాగంగానే గోల్డ్ స్ట్రీట్ గురించి కూడా వెల్లడించింది. ఈ డిస్ట్రిక్ట్‌లో 1,000కిపైగా రిటైల్ దుకాణాలు ఉంటాయి. వీటిలో బంగారం, ఆభరణాలు, పెర్ఫ్యూమ్స్, కాస్మెటిక్స్, లైఫ్‌ైస్టెల్ క్యాటగిరీల దుకాణాలు ఉంటాయి. బంగారాన్ని ఉపయోగించి వీధిని, రోడ్డును నిర్మించడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. దుబాయ్ వాణిజ్య వారసత్వం, సంస్కృతిలో బంగారం ఓ భాగమని దుబాయ్ పర్యాటక శాఖ తెలిపింది.