Donald Trump : ఇరాన్-అమెరికా యుద్ధం ప్రారంభమై ఆరు నెలలు గడిచింది. ఇప్పటికే అప్పుడప్పుడూ దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో యుద్ధం ముగిసిందని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇందుకు అనుగుణంగా ప్రకటన చేసేందుకు ట్రంప్ కార్యాలయం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇదే సమయంలో హార్ముజ్ జలసంధితోపాటు, మిడిల్ ఈస్ట్‌లో సైన్యాన్ని మోహరించాలని కూడా అమెరికా భావిస్తోంది. యుద్ధాన్ని ముగిసినట్లు ప్రకటించడం, సైన్యాన్ని మోహరించడం వంటి అంశాలపై ట్రంప్ కార్యాలయం తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయంలో అధికారిక ప్రకటన ఏమీ వెలువడలేదు. మరోవైపు.. మిడిల్ ఈస్ట్‌లో భారీగా అమెరికా సైన్యాన్ని మోహరించాలని ఆ దేశ రక్షణ శాఖ సెక్రెటరీ పీట్ హెగ్సెత్ ఆదేశించారు.
గత ఫిబ్రవరి 28న ఇరాన్ యుద్ధం విషయంలో ట్రంప్ ప్రభుత్వం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కుంటోంది. ఈ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. చమురు సరఫరాకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. దీంతో ట్రంప్ సర్కార్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ నేపథ్యంలో అవసరమైతే ఇరాన్‌తో కుదుర్చుకోవాలని భావించిన అణు ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకోవాలని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే, దీనికి బదులుగా హార్ముజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా తెరవాలని ట్రంప్ కోరనున్నటు తెలుస్తోంది. ఈ విషయంలో ఇంకా ట్రంప్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.