వాషింగ్టన్: అమెరికా హెచ్-1బీ వీసా దరఖాస్తు వార్షిక రుసుము 1 లక్ష డాలర్లకు పెరగడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్న ఇండియన్ ప్రొఫెషనల్స్‌కు గొప్ప శుభవార్త! సీనియర్ అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ అధికారి ఒకరు ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ట్రంప్ ప్రకటించిన కొత్త రుసుము కేవలం కొత్త దరఖాస్తులకు మాత్రమే వర్తిస్తుందని చెప్పారు. ప్రస్తుత హెచ్-1బీ వీసాదారులకు లేదా రెన్యువల్స్‌కు వర్తించదని స్పష్టం చేశారు. ఇప్పటికే హెచ్-1బీ వీసా కలిగినవారు ఎటువంటి ఆందోళనకు గురి కావలసిన అవసరం లేదన్నారు.
వీరు ప్రస్తుతం విదేశాల్లో లేదా భారత దేశంలో ఉన్నప్పటికీ ఆందోళన అవసరం లేదని వివరించారు. కొత్త నిబంధన అమల్లోకి రావడానికి ముందే అమెరికాకు తిరిగి చేరుకోవాలనే ఆందోళన అక్కర్లేదని చెప్పారు. దీంతో ఇండియన్ ప్రొఫెషనల్స్ ఊపిరి పీల్చుకోవచ్చు. అయితే హెచ్-1బీ వీసా దరఖాస్తుల వార్షిక రుసుమును 1 లక్ష డాలర్లకు పెంచడం వల్ల డిగ్రీ, పీజీ చదివిన విద్యార్థులు; మన దేశం నుంచి అమెరికాకు ఉద్యోగం కోసం వెళ్లాలనుకునేవారిపైనా ప్రభావం పడనుంది.