వాషింగ్టన్: ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీకి (Harvard University) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో షాకిచ్చారు. ఇప్పటికే యూనివర్సిటీకి ఫెడరల్ నిధుల్లో కోత పెట్టిన ట్రంప్.. తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి వర్సిటీలో విదేశీ విద్యార్థుల ప్రవేశాలపై నిషేధం విధించింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) కార్యదర్శి క్రిస్టి నోయెమ్ (Kristi Noem) యూనివర్సిటీకి లేఖ రాశారు. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని అందులో పేర్కొన్నారు. దీంతో ఇకపై హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో కొత్తగా విదేశీ విద్యార్థులకు ప్రవేశాలు నిలిచిపోనున్నారు. ఇప్పటికే వర్సిటీలో చదవుతున్న విదేశీ విద్యార్థులు మరొక విశ్వవిద్యాలయానికి బదిలీ కావడమో లేదా దేశం విడిచి వెళ్లడం చేయాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏది చేయకపోయినా చట్టపరమైన చర్యలు ఉంటాయని నోయెమ్ హెచ్చరించారు.
దీంతోపాటు విదేశీ విద్యార్థులు వీసాలు, అమెరికాలో చదువుకోవడానికి ప్రవేశం పొందే వ్యవస్థ అయిన యూనివర్సిటీ స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ (SEVIS) సర్టిఫికేషన్ కూడా రద్దు చేసినట్లు వెల్లడించారు. ట్రంప్ సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయంతో భారతీయ విద్యార్థులను తీవ్రంగా ప్రభావితం చేయనుంది.
కాగా, హార్వర్డ్‌లో హింసను, యూదు వ్యతిరేకతను ప్రోత్సహించడం, చైనా కమ్యూనిస్టు పార్టీతో కలిసి పనిచేయడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని క్రిస్టి నోయెమ్ అన్నారు. విదేశీ విద్యార్థులను నమోదు చేసుకోవడం ఓ హక్కు కాదని, అది ఓ అర్హత మాత్రమేనని పేర్కొన్నారు. వర్సిటీలు విదేశీ విద్యార్థులను చేర్చుకోవడం, వారు చెల్లించే అధిక ఫీజులతో ప్రయోజనం పొంది బిలియన్ డాలర్ల మేర నిధులు సమకూర్చుకుంటున్నాయని ఎక్స్ వేదికగా చెప్పారు. అయితే ట్రంప్ సర్కారు నిర్ణయాన్ని హార్వర్డ్ విశ్వవిద్యాలయం తీవ్రంగా ఖండించింది. ఇది చట్టవిరుద్ధమైన చర్యగా పేర్కొంది. ఇది యూనివర్సిటీకి, అమెరికాకు తీవ్రమైన హాని కలిగించే అంశమని వెల్లడించింది.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి గెలుపొందినప్పటి నుంచి హార్వర్డ్ యూనివర్సిటీపై వేధింపులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అడ్మిషన్ విధానాలు, ఆడిట్, కొన్ని స్టూడెంట్ క్లబ్‌ల గుర్తింపు రద్దు వంటి సంస్కరణలు చేపట్టాలని ట్రంప్ సర్కార్ కోరింది. దీనికి వర్సిటీ స్పందించకపోగా ప్రభుత్వానికి లొంగేది లేదని స్పష్టం చేసింది. తమ స్వాతంత్య్రం, రాజ్యాంగ హక్కుల విషయంలో రాజీ పడలేదని స్పష్టం చేసింది. తాము చట్ట ప్రకారమే నడుచుకుంటామని.. ప్రభుత్వ యంత్రాంగం కూడా వాటికి అనుగుణంగానే వ్యవహరించాలని కోరింది. దీంతో హార్వర్డ్‌పై ట్రంప్ పలు ఆంక్షలు విధిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్‌లో ఆ వర్సిటీకి అందాల్సిన 2.2 బిలియన్ డాలర్ల ఫెడరల్ నిధులను స్తంభింపజేశారు. అనంతరం విశ్వవిద్యాలయానికి అందించే ఫెడరల్ నిధులను నిలిపివేశారు. ప్రభుత్వ డిమాండ్లను నెరవేర్చే వరకు హార్వర్డ్‌కు ఎటువంటి కొత్త గ్రాంట్లు మంజూరుచేసేది లేదని స్పష్టం చేశారు. తాజాగా విదేశీ విద్యార్థుల అడ్మిషన్లను నిషేధించారు.
అమెరికాలో పురాతన, సంపన్న విశ్వవిద్యాలయాల్లో హార్వర్డ్ ఒకటి. ఈ యూనివర్సిటీలో ప్రతీ ఏడాది 140 కంటే ఎక్కువ దేశాల నుంచి విద్యార్థులు అడ్మిషన్లు పొందుతున్నారు. ఒక్క మసాచుసెట్స్‌లోని హార్వర్డ్ కేంబ్రిడ్జ్ క్యాంపస్‌లోనే దాదాపు 6,800 మంది విదేశీ విద్యార్థులు చేరుతున్నారు. వీరిలో ఎక్కువ మంది గ్రాడ్యుయేట్ విద్యార్థులే ఉండటం గమనార్హం.