లాస్ఏంజెల్స్, ఫిబ్రవరి 6: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో తుఫాన్ బీభత్సం సృష్టించింది. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావడమే కాక పలు చోట్ల భారీ హిమపాతం కురిసింది. దీంతో లాస్ ఏంజెల్స్ సహా పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఆకస్మిక వరదలు సంభవించాయి. మట్లిపెళ్లలు విరిగిపడ్డాయి. సోమవారం దక్షిణ కాలిఫోర్నియాలోని కోస్తా, లోయ ప్రాంతాల్లో సుమారు 20 సెం.మీ వర్షపాతం నమోదు కాగా, రానున్న రెండు రోజుల్లో పర్వత ప్రాంతాల్లో 35 సెం.మీ వర్షపాతం కురవొచ్చునని హెచ్చరికలు జారీ అయ్యాయి.
తుఫాన్ కారణంగా ఉత్తర కాలిఫోర్నియాలో ముగ్గురు మృతి చెందారు. అలాగే వరద నీటిలో కొట్టుకుపోతున్న పలువురిని సహాయ బృందాలు రక్షించాయి. భారీ హిమపాతం కారణంగా ఎక్కడబడితే అక్కడ పెద్దయెత్తన మంచు పేరుకుపోయింది. సియారా నెవెడాలో భారీగా మంచు కురియడంతో మౌంటెన్ రోడ్లపై ప్రయాణించవద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. పలుచోట్ల అత్యవసర పరిస్థితిని విధించారు. దక్షిణాన ఉన్న పర్వత ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. తుఫాన్ కారణంగా పలువురు నిరాశ్రయులయ్యారు. సోమవారం సాయంత్రం నుంచి 7,10,00 మంది విద్యుత్తు లేక అంధకారంలో మగ్గుతున్నారు.