US Citizenship | వాషింగ్టన్, ఏప్రిల్ 14: అమెరికా పౌరసత్వం లేదా గ్రీన్‌కార్డు ఉన్న వ్యక్తిని వివాహం చేసుకుని అమెరికాలో స్థిరపడాలని కలలు కనే వలసవాదారుల ఆశలు ఇక అంత సులువుగా నెరవేరే అవకాశం లేదు. అక్రమ వలసదారులపై కొరడా ఝళిపిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు వచ్చే వీసాదారులపై ఆంక్షలు కఠినతరం చేస్తున్న కారణంగా బైడెన్ పాలనకు పూర్తి భిన్నంగా పరిస్థితులు మారిపోతున్నాయి. గ్రీన్‌కార్డు కలిగిన వ్యక్తిని వివాహం చేసుకున్న భాగస్వామికి గతంలో ఇంటర్వ్యూలను సైతం పక్కనపెట్టి గ్రీన్‌కార్డు మంజూరు చేసిన రోజులు ఉన్నాయి. కాని ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. దరఖాస్తు ప్రక్రియ దశలోనే జల్లెడ పడుతూ ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనపడుతోంది.
జీవిత భాగస్వామికి సంబంధించిన ఆహార, నిద్ర అలవాట్లు, అలర్జీలు, ఇష్టాయిష్టాలు తదితర అంశాల గురించి గ్రీన్‌కార్డు దారునికి ఏమాత్రం అవగాహన ఉందో అధికారులు ఆరా తీస్తూ ధ్రువీకరణ పత్రాలన్నిటినీ నిశితంగా పరిశీలిస్తున్నారు. బైడెన్ పాలనకు భిన్నమైన పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయని, అధికారులు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా నిర్ధారించుకుంటున్నారని, వివాహానికి సంబంధించిన సాక్ష్యాలను అత్యంత నిశితంగా పరిశీలిస్తున్నారని ఇమిగ్రేషన్ అటార్నీ అశ్విన్ శర్మ వెల్లడించారు.
గ్రీన్‌కార్డుకు ఆమోదం లభించాలంటే అత్యంత క్లిష్టమైనది ఇంటర్యూను ఎదుర్కోవడం. అమెరికా వెలుపల నివసిస్తూ గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసే జీవిత భాగస్వామికి అమెరికా కాన్సులేట్ అధికారులు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఉదాహరణకు హెచ్-1బీ వీసాపై అమెరికాలో ఉంటూ గ్రీన్కార్డుదారుని వివాహం చేసుకున్న భాగస్వామి తన హోదాను గ్రీన్కార్డుగా మార్చుకోవడానికి దరఖాస్తు చేసుకున్నపుడు వారికి యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. ఇంటర్వ్యూలో తమ జీవిత భాగస్వామికి సంబంధించిన అన్ని విషయాలను సంపూర్ణంగా తెలుసుకుని జవాబివ్వాలని ఇమిగ్రేషన్ న్యాయవాదులు హెచ్చరిస్తున్నారు. వివాహానికి సంబంధించిన పక్కా సాక్ష్యాలు సమర్పించాలని తమను అధికారులు కోరుతున్నారని, త్వరలో ఇది అధికారిక విధానం అయ్యే అవకాశం ఉందని అటార్నీ శర్మ చెప్పారు.
పెళ్లయిన జంటకు సంబంధించి వారు ఎప్పుడు ఎక్కడ కలుసుకున్నారు, కలసి ఎందుకు జీవించాలనుకుంటున్నారు, వారి మధ్య అనుబంధం ఎలా ఉంది తదితర దాంపత్యానికి సంబంధించిన వివరాలను కూడా అధికారులు కూపీ లాగుతున్నారని శర్మ తెలిపారు. కాన్సులర్ కేసులలో వీసా ఇంటర్వ్యూకు అమెరికా పౌరసత్వం ఉన్న వ్యక్తిని అనుమతించనందున ధ్రువీకరణ పత్రాలపైనే మొత్తం ప్రక్రియంతా ఆధారపడి ఉంటుందని తెలిపారు. ధ్రువీకరణ పత్రాలే వారి వివాహ బంధాన్ని గురించి రుజవు చేయాల్సి ఉంటుంది. దంపతుల మధ్య వివాహం జరిగిన తీరు, వారి మధ్య ఉన్న అనుబంధం, ఎడబాటులో ఉన్నా వారి బంధం కొనసాగుతున్న తీరు, ఇందుకు సంబంధించిన ఉత్తరప్రత్యుత్తరాలు వంటి కమ్యూనికేషన్‌కు సంబంధించిన సాక్ష్యాలు, ఉభయులకూ సంబంధించిన సందర్శనలు, వివాహం విషయంలో రెండు కుటుంబాల ప్రమేయం వంటి వివరాలన్నిటినీ పక్కా సాక్ష్యాధారాలను పరిశీలించి మరీ ఇమిగ్రేషన్ అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు అటార్నీ చెప్పారు.
వివాహమైనట్టు రుజువు చేసే ధ్రువీకరణ పత్రాలతోపాటు నగదు బదిలీ రసీదులు, మొబైల్ కాల్స్ వివరాలు, ఫొటోలు, జాయింట్ బ్యాంకు అకౌంట్లతోపాటు జాయింట్ లైఫ్ ఇన్సూరెన్సు పాలసీలను సైతం చూపించాల్సి ఉంటుందని ఎన్పీజెడ్ లా గ్రూపు మేనేజింగ్ అటార్నీ స్నేహల్ బాత్రా తెలిపారు. వీటితోపాటు జీవిత భాగస్వామి ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం, జీతం, విద్య, పూర్వ వివాహం ఏదైనా ఉంటే అందుకు సంబంధించిన వివరాలతోసహా వైవాహిక బంధానికి సంబంధించిన అన్ని ప్రశ్నలకు ఇంటర్వ్యూలో సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందని బాత్రా చెప్పారు. వివాహం బోగస్‌దని తేలి గ్రీన్ కార్డు దరఖాస్తు నిరాకరణకు గురైన పక్షంలో అమెరికాలోనే భాగస్వామి ఉన్న పక్షంలో స్వదేశానికి వెళ్లిపోవలసి ఉంటుందని బాగ్రా హెచ్చరించారు.