బీజింగ్: అంతరిక్షంలో మెగా ప్రాజెక్టుల నిర్మాణానికి చైనా ప్రణాళికలు సిద్ధం చేసింది. టూరిజం కాంప్లెక్స్‌లు మొదలుకొని.. గ్యాస్ స్టేషన్లు, సౌర విద్యుత్ కేంద్రాలు, ఆస్టరాయిడ్ల మైనింగ్‌కు అవసరమైన కేంద్రాలను నిర్మించడానికి సిద్ధమైంది. ఈ మేరకు నేషనల్ నాచురల్ సైన్స్ ఫౌండేషన్ ఆఫ్ చైనా(ఎన్ఎస్ఎఫ్సీ) ఐదేండ్ల ప్రణాళికను ప్రకటించింది.
ఇందుకోసం అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేయాలని శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చింది. ఈ నిర్మాణాల కోసం తేలికపాటి మెటీరియల్ కావాలని, అభివృద్ధి చేయాలని కోరింది. అంతరిక్షంలో ఈ మెగా ప్రాజెక్టులు అత్యవసరమని చైనా అభిప్రాయపడింది. ఈ ప్రణాళికల్లో భాగంగానే చైనా సొంతంగా అంతరిక్ష పరిశోధన కేంద్రం, సౌర విద్యుత్తుకేంద్రం తదితర నిర్మాణాలను ప్రారంభించింది.