Hare Krishna : నేపాల్ వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ వరదల నుంచి తొమ్మిదో రోజైన శుక్రవారం కూడా ఇద్దరు బతికి బయటపడ్డ సంగతి తెలిసిందే. నేపాల్లోని త్రిశూలి 3ఏ ప్రాజెక్ట్ టన్నెల్ నుంచి ఇద్దరిని సహాయక బృందాలు కాపాడాయి. తొమ్మిది రోజులుగా వీరు మృత్యువుతో పోరాడి గెలిచారు. సహాయం కోసం ఎదురుచూసిన వారి ఆశలు ఫలించాయి.
అలా బయటపడ్డ ఇద్దరిలో సంజయ్ సాహ్ ఒకరు. ఈ 9 రోజులు తాను ‘హరేకృష్ణ మహామంత్రం’ జపించినట్లు ఆయన వెల్లడించారు. తొమ్మిది రోజులు తాను సాయం కోసం ఎదురుచూస్తూ, హరేకృష్ణ మహామంత్రం జపిస్తూ ఉండిపోయానని చెప్పారు. ఇక, ఆయనను ఆ శ్రీ కృష్ణుడు జన్మించిన కృష్టాష్టమి రోజున కాపాడటం విశేషంగా స్థానికులు చెబుతున్నారు. సంజయ్ సాహ్ నేపాల్లోని మాదేశ్ ప్రావిన్స్, సప్తారి జిల్లాకు చెందిన వ్యక్తి. అతడు నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీలో పని చేస్తున్నాడు. అతడిని నేపాల్ సహాయక బృందాలు గుర్తించిన తర్వాత త్రిశూలిలోని ఆస్పత్రికి తరలించారు.
అక్కడ అతడికి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఏ ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. మరోవైపు సంజయ్ సాహ్తోపాటు టన్నెల్ నుంచి రక్షించిన కబీర్ మహాజన్ కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయనకు కూడా ప్రాణాపాయం ఏమీ లేదని తెలుస్తోంది. ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.