Ganesh Chaturthi : వినాయక చవితి వేడుకలకు మరో వారం రోజులు కూడా లేవు. ఇలాంటి సమయంలో అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు స్థానిక ఇండియన్ కమ్యూనిటీ నాయకుల నుంచి కీలక సూచనలు అందుతున్నాయి. వినాయక చవితి వేడుకల్ని భారతీయులు తమ ఇంట్లోనే కుటుంబంతో కలిసి మాత్రమే జరుపుకోవాలని సూచిస్తూ ఒక మెసేజ్ ఎన్ఆర్ఐ కమ్యూనిటీలో సర్క్యులేట్ అవుతోంది. ఈ అలర్ట్ మెసేజ్ ప్రకారం.. గణేష్ చతుర్థి వేడుకల్ని ఇంట్లోనే జరుపుకోవాలి.
అపార్ట్మెంట్లు, కాలనీ, పబ్లిక్ ప్లేసుల్లో సామూహికంగా వేడుకలు జరుపుకోకూడదు. ఎవరైనా మిమ్మల్ని వేడుకలకు ఆహ్వానిస్తే ఇంట్లోనే జరుపుకొంటామని వారికి చెప్పండి అంటూ ఆ మెసేజ్‌లో ఉంది. అలాగే, కంటెంట్ క్రియేటర్లకు కూడా పలు సూచనలు చేశారు. ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు, గ్రూప్ వీడియోలు, రోడ్ సైడ్ సెలబ్రేషన్స్ వంటివి కూడా పోస్ట్ చేయకూడదు. మండపాలు వేసుకోవడం, ఎక్కువ మంది చేరి గుంపుగా, భారీ శబ్దంతో వేడుకలు జరుపుకోవడం, రోడ్డుపై సెలబ్రేషన్స్ చేయడం, నదుల్లో విసర్జనం చేయడం వంటివి కూడా చేయకూడదని సూచించారు.
శాంతియుతంగా వేడుకలు జరుపుకొని, స్థానిక రూల్స్ ఫాలో అవ్వాలి అంటూ అందులో పేర్కొన్నారు. ఎన్ఆర్ఐలకు సంబంధించిన కొన్ని కమ్యూనిటీ అకౌంట్లలో ఈ తరహా పోస్టులు అమెరికాలో వైరల్ అవుతున్నాయి. ఇందుకు కారణం ఉంది. అమెరికాలో ఇటీవల యాంటీ ఇండియా వేవ్ కనిపిస్తోంది. అంటే, భారతీయులపై స్తానికుల్లో తీవ్ర వత్యిరేకత కనిపిస్తోంది. పైగా ఇండియన్స్ ఇటీవల చేస్తున్న పనులు కూడా అభ్యంతరకరంగా ఉంటున్నాయి. కొంతమంది నేరాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియా కంటెంట్ క్రియేషన్ పేరుతో పబ్లిక్ ప్లేసులలో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. అలాగే, రోడ్లపై, పబ్లిక్ ప్లేసులలో వేడుకలు జరుపుకొంటున్నారు.
ఇదే సమయంలో తమ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారనే కోపం స్థానికుల్లో పెరిగిపోతుంది. టెక్సాస్, డల్లాస్ లాంటి చోట్ల ఇండియన్స్ ఆధిపత్యం పెరిగిపోతుండటాన్ని స్థానికులు జీర్ణం చేసుకోలేకపోతున్నారు. మాగా (మేక అమెరికా గ్రేట్ ఎగైన్) కు మద్దతు తెలిపే వారు ఇండియన్స్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జాతి విద్వేషానికి పాల్పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియన్స్ జరుపుకొనే వేడుకలు అమెరికా ప్రజలకు మరింత ఆగ్రహాన్ని తెప్పించవచ్చనేది అక్కడి ఎన్ఆర్ఐ నేతల అంచనా. అందుకే ఇండియన్ కమ్యూనిటీపై అమెరికాలో వ్యతిరేకత పెరగకుండా ఉండేందుకు, అందరి భద్రత రీత్యా స్థానిక ఇండియన్ కమ్యూనిటీ పెద్దలు ఈ సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.