Global Warming | లండన్: భగభగలాడే ఎండలో ఏదైనా పనిమీద ఇంటి నుంచి బయటకు వెళ్లడం ఎవరికైనా ఇబ్బందికరమే. కానీ, సమీప భవిష్యత్తులో అదేమీ ఇబ్బందికరం కాకపోవచ్చు. ఎందుకంటే భూతాపాన్ని (గ్లోబల్ వార్మింగ్‌ను) అరికట్టేందుకు సూర్యుడిని మసకబార్చాలని నిపుణులు భావిస్తున్నారు. అందుకోసం ప్రయోగాలు చేపట్టాలని యోచిస్తున్నారు.
భూమి పైనుంచి సూర్యరశ్మిని ప్రతిబింబించే ఈ ప్రయోగాలకు బ్రిటన్ ప్రభుత్వం త్వరలో అనుమతి ఇవ్వబోతున్నట్టు ‘టెలిగ్రాఫ్’ పత్రిక వెల్లడించింది. ఏరోసోల్స్‌ను ఇంజెక్ట్ చేయడం, సూర్యరశ్మిని ప్రతిబింబించేందుకు మేఘాలను ప్రకాశవంతం చేయడం లాంటి అవుట్డోర్ ప్రాజెక్టులు, పరీక్షలను చేపట్టబోతున్నట్టు బ్రిటన్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని అడ్వాన్స్డ్ రిసెర్చ్ అండ్ ఇన్వెన్షన్ ఏజెన్సీ (ఏఆర్ఐఏ) ప్రోగ్రామ్ డైరెక్టర్ ప్రొఫెసర్ మార్క్ సైమెస్ వెల్లడించారు. మరికొద్ది వారాల్లో ప్రకటించనున్న ఈ ప్రాజెక్టుల కోసం ఏఆర్ఐఏ 50 మిలియన్ల పౌండ్లను కేటాయించింది.