బ్రెసిలియా: బ్రెజిల్ అధ్యక్షుడు (Brazil Presiden) లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా తన నివాసంలోని బాత్రూంలో జారిపడ్డారు. దీంతో ఆయన తలకు గాయమైంది. లూలా ప్రస్తుతం బాగానే ఉన్నారని, ఆయన తలకు కుట్లు వేయాల్సి వచ్చిందని డాక్టర్ రాబర్టో కలీల్ చెప్పారు. ఆయన చిన్న మెదడులో రక్తస్రావం అయిందని తెలిపారు. దీంతో వారం మొత్తం లూలాకు పరీక్షలు చేయాల్సి ఉందన్నారు. తర్వాతి రోజుల్లో గాయం మరింత తీవ్రమవుతుంది కాబట్టి క్రమం తప్పకుండా పరిశీలించాల్సి ఉంటుందని వెల్లడించారు. అయితే అధ్యక్షుడి ఆరోగ్యం గురించి ఆందోళన అవసరం లేదని, రోజువారి కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని పేర్కొన్నారు. తాత్కాలికంగా ఎక్కువ దూరం విమాన ప్రయాణం మంచిది కాదని తెలిపారు.
ఈ నేపథ్యంలో రష్యాలో జరుగనున్న బ్రిక్స్ సదస్సుకు అధ్యక్షుడు లూలా దూరం కానున్నారు. అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతారని ఆయన కార్యాలయం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఆయన రష్యాకు బయల్దేరాల్సి ఉన్నది.