Bolsonaro : బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు (Brazil Ex President) జైర్ బోల్సొనారో (Jair Bolsonaro) అరెస్టయ్యారు. ఫెడరల్ పోలీసులు (Federal police) శనివారం ఉదయం రాజధాని బ్రసీలియాలో ఆయనను తమ కస్టడీలోకి తీసుకున్నారు. అయితే అరెస్టుకు కారణాలను మాత్రం వెల్లడించలేదు. అయితే తిరుగుబాటు కుట్రకు సంబంధించిన కేసులో ఆయనను ప్రశ్నించాల్సి ఉందని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.
కాగా తిరుగుబాటుకు కుట్ర చేశారన్న అభియోగాలపై ఇప్పటికే ఆయనకు 27 సంవత్సరాలు శిక్ష పడింది. మరికొన్ని రోజుల్లో జైలుకు వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే విదేశాలకు పారిపోకుండా ముందస్తుగా ఆయనను ఫెడరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఉదయం అరెస్టు చేశారని, బ్రసీలియాలోని పోలీసు కేంద్ర కార్యాలయానికి ఆయనను తరలించారని బోల్సొనారో ప్రతినిధి వెల్లడించారు.
మరోవైపు ఇదే అంశంపై ఫెడరల్ పోలీసులు స్పందిస్తూ.. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. 2019 నుంచి 2022 వరకు బ్రెజిల్ అధ్యక్షుడిగా ఉన్న బోల్సొనారో.. 2022 ఎన్నికల్లో ఓడిపోయారు. అయినప్పటికీ ఫలితాలను అంగీకరించేందుకు నిరాకరించారు. ఆ సమయంలో వేల సంఖ్యలో ఆయన మద్దతుదారులు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు.
పదవిలో కొనసాగడం కోసం బోల్సొనారో తిరుగుబాటు కుట్ర చేశారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఆయనకు 27 ఏళ్ల శిక్ష విధిస్తూ ఈ సెప్టెంబర్లో తీర్పు చెప్పింది. అయితే ఈ కేసు విచారణ సమయం నుంచే బోల్సొనారో గృహనిర్బంధంలో ఉన్నారు. న్యాయస్థానం విధించిన శిక్షపై అప్పీలుకు వెళ్లగా అక్కడ చుక్కెదురయ్యింది. జైలుకెళ్తే తీవ్ర ఇబ్బందులు ఉంటాయని, ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన తరఫు న్యాయవాదులు వాదించినా ఉపశమనం దక్కలేదు.