BlueSky | ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ ఉన్న సామాజిక మాధ్యమాల్లో ట్విట్టర్ ఒకటి. ఇటీవల ఇది ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ చేతుల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ట్విట్టర్ తరహాలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు ఆ కంపెనీ మాజీ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ. త్వరలోనే దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కొత్త సోషల్ మీడియా అప్లికేషన్‌ను త్వరలోనే ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు. తన డీసెంట్రలైజ్డ్ ‘బ్లూ స్కై’ సోషల్ యాప్ బీటా పరీక్షలకు వెళ్లనున్నట్టు జాక్ డోర్సే ఇటీవల ప్రకటించారు.
ఈ యాప్‌లో ఏటీ ప్రోటోకాల్ టెక్నాలజీని వాడనున్నారు. ఈ కొత్త సోషల్ నెట్వర్క్ అన్నది ఒక సైట్ కాకుండా ఒకటికి మించిన వెబ్సైట్లతో నడవనుంది. బ్లూస్కైని ఉపయోగించడానికి ప్రత్యేకంగా వెబ్‌సైట్‌కు వెళ్లాల్సిన అవసరం లేదని జాక్ డోర్సీ పేర్కొన్నారు. ప్రొటోకాల్ టెస్టింగ్‌ను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. డిస్ట్రిబ్యూటెడ్ ప్రొటోకాల్ అభివృద్ధి అనేది ఎంతో సంక్లిష్టమైన ప్రక్రియ అని, భాగస్వాముల నుంచి సమన్వయం అవసరమన్నారు. ఒకసారి నెట్‌వర్క్‌ను ప్రారంభించామంటే, అప్పుడు ప్రైవేట్ బీటా మొదలుపెట్టి, సమస్యలను సరి చేస్తామని చెప్పారు.