ఇస్లామాబాద్: వివిధ అవినీతి నేరాల్లో 2023 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఇస్లామాబాద్ హైకోర్టు భారీ ఉపశమనం కల్పించింది. జైలులో ఇమ్రాన్ ఖాన్, అతని భార్య బుష్రా బీబీలను ఏకాంత నిర్బంధంలో ఉంచరాదని ఆదేశాలు జారీ చేసింది. అలాగే జైలు నిబంధనల ప్రకారం అతని కుటుంబ సభ్యులను కలిసేందుకు ఏర్పాటు చేయాలని, ఇమ్రాన్ తన కుమారులతో మాట్లాడేందుకు టెలిఫోన్ సౌకర్యం కల్పించాలని, ప్రతిరోజూ చదువుకునేందుకు దినపత్రికలు, పుస్తకాలు ఏర్పాటు చేయాలని, అవసరమైన మందులు, వైద్య సౌకర్యాలు కల్పించాలని న్యాయమూర్తి ఖదీమ్ హుస్సేన్ సూమ్రో ఆదేశాలు ఇచ్చారు. దీనిపై 15 రోజుల్లో తమకు నివేదిక సమర్పించాలని అడియాలా జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.