MacKenzie Scott : అమెజాన్ కంపెనీ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకంజీ స్కాట్ తన ఉదారతను మరోసారి చాటుకుంది. నవలా రచయిత అయిన ఆమె తన సంపదతో సగానికి పైగా విరాళం ఇస్తానని గతంలో ప్రకటించింది. చెప్పినట్టుగానే మూడేళ్లలో 14 వందల కోట్ల డాలర్లను విరాళంగా ఇచ్చింది. మెకంజీ నుంచి డొనేషన్ అందుకున్న సంస్థల్లో 16 వేల ఎన్జీవోలు ఉన్నాయి. ఈ విషయాన్నిఈల్డ్ గివింగ్ (Yield Giving) అనే వెబ్సైట్ వెల్లడించింది. ఇందులో స్కాట్ ఏ సంస్థకు ఎంత విరాళం ఇచ్చింది అనే వివరాలు అన్నీ పొందుపరిచారు. ‘ఇతరులు, డొనేషన్స్ ఇచ్చేవాళ్లు, నా టీమ్ ఇచ్చే సమాచారం విరాళం ఇవ్వడంలో నాకు చాలా సహాయపడుతోంది’ అని స్కాట్ తెలిపింది. అంతేకాదు డొనేషన్స్ కావాలనుకునే సంస్థలు తమ వివరాలు పంపించాలని మెకంజీ తెలిపింది. ఇప్పటి వరకు మెకంజీ , ఆమె టీమ్ విరాళాలు ఇచ్చే ముందు ఆయా సంస్థల గురించి రహస్యంగా ఆరా తీస్తున్నారు.
మెకంజీ స్కాట్, జెఫ్ బెజోస్‌లు 1993లో వివాహం చేసుకున్నారు. బెజోస్‌కు ఒక టీవీ యాంకర్‌తో సంబంధం ఉందనే వార్తలు రావడంతో మెకంజీ అతనికి విడాకులు ఇవ్వాలనుకుంది. దాంతో, వీళ్లు 2019 విడాకులు తీసుకున్నారు. భరణం కింద బెజోస్ ఆమెకు 38 కోట్ల డాలర్లు చెల్లించాడు. వీళ్ల విడాకులను అత్యంత ఖరీదైనవిగా చాలామంది పేర్కొన్నారు. దాంతో మెకంజీ ఒక్కసారిగా కోట్లకు పడగలెత్తింది. అమెరికాలో ధనవంతురాలైన మూడో మహిళగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్నుల జాబితాలో స్కాట్ 35వ స్థానం దక్కించుకుంది. ప్రస్తుతం స్కాట్ సంపద 26.2 బిలియన్ డాలర్లు. బెజోస్‌తో విడిపోయిన తర్వాత మెకంజీ సియాటెల్‌కు చెందిన సైన్స్ టీచర్ డాన్ జెవెట్‌ను పెళ్లి చేసుకుంది. రెండో వివాహం అయ్యాక ఆమె సేవ మీద మరింత దృష్టి పెట్టింది.