వాషింగ్టన్: ఈ ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున జో బైడెన్ మరోసారి రేసులో పాల్గొనేందుకు ఆసక్తిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఆయన మతిమరుపు సమస్యతో బాధపడుతున్నారు. పలుమార్లు సభల్లో వింతగా ప్రవర్తించారు. దీనికి తోడు ప్రత్యర్థి రిపబ్లికన్ నేత ట్రంప్.. ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. దీంతో బైడెన్ కు వ్యతిరేకంగా డెమోక్రాట్లలో అసహనం వ్యక్తం అవుతోంది. ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై జో బైడెన్ పునరాలోచించాలని భావిస్తున్నట్లు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా(Barack Obama) తెలిపారు. బైడెన్ విజయావకాశాలు సన్నగిల్లినట్లు ఒబామా అంచనా వేస్తున్నారు. బైడెన్ తన అభ్యర్ధిత్వాన్ని మరోసారి ఆలోచించాల్సి వస్తుందన్నారు. వాషింగ్టన్ పోస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒబామా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని తమ పార్టీ నేతలకు కూడా చెప్పినట్లు ఒబామా పేర్కొన్నారు.
ఒబామా దేశాధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. 2009 నుంచి 2017 వరకు జో బైడెన్ ఉపాధ్యక్షుడిగా చేశారు. ఈసారి రేసు నుంచి బైడెన్ తప్పుకోవాలని చాలా మంది డెమోక్రాట్లు అభిప్రాయపడుతున్నారు. ఇక ఒబామా కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.
ప్రస్తుతం బైడెన్ కోవిడ్‌తో బాధపడుతున్నారు. ఆయన తన ఇంట్లోనే ఉన్నారు. కానీ తన వయసు, ఫిట్నెస్ విషయంలో వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. వైట్‌హౌజ్‌కు రేసులోనే ఉన్నట్లు కూడా వెల్లడించారు.