నాష్విల్లే (యూఎస్), డిసెంబర్ 10: అమెరికాలోని సెంట్రల్ టెన్నెసీ రాష్ర్టాన్ని శనివారం తీవ్ర తుఫానులు వణికించాయి. తుఫాన్ల తాకిడికి ఆరుగురు మరణించగా, 24 మంది దవాఖాన పాలయ్యారు. తుఫాను ధాటికి పలు ఇండ్లు, వాణిజ్య సంస్థలకు తీవ్ర నష్టం వాటిల్లింది. సుమారు 85 వేల మంది పౌరులు అంధకారంలో చిక్కుకున్నారు. మౌంట్గోమెరీ కౌంటీని తీవ్రమైన టోర్నడో చుట్టుముట్టడంతో దాని తాకిడికి ఒక చిన్నారి సహా ముగ్గురు మరణించారని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మౌంట్గోమెరీలో ఒక తుఫాను సహాయ శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. కెంటకీని కూడా సుడిగాలి తాకింది. నాష్విల్లేలో ముగ్గురు మరణించారని, మౌంట్గోమెరీ కౌంటీలో 23 మంది గాయాలతో చికిత్స పొందుతున్నారని అధికారులు చెప్పారు.
అమెరికాలో కాల్పులు.. ముగ్గురి మృతి
అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. జార్జియా రాజధాని అట్లాంటాలో చోటుచేసుకున్న కాల్పుల్లో ముగ్గురు మరణించారు. ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులందరూ 20 ఏండ్ల లోపు వారేనని, డ్రగ్స్ వ్యవహారమే కాల్పులకు కారణమై ఉండొచ్చని పోలీసులు తెలిపారు.