Shooting in Los Angeles | అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. లాస్ ఏంజిల్స్‌లోని బెనెడిక్ట్ కెన్యాన్ ఏరియాలో శనివారం తెల్లవారుజామున 2.55 గంటల సమయంలో ఆగంతకులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో నలుగురు వ్యక్తులు గాయపడ్డారని ఎల్ఏపీడీ కెప్టెన్ జొనాథన్ టిప్పెట్ తెలిపారు. ఒక వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు మరణించారు. రోడ్డుపైన వెళుతున్న వారు మరో నలుగురు గాయ పడినట్లు పోలీసులు చెప్పారు. ఒక వ్యక్తే కాల్పులకు పాల్పడ్డాడా, ఒకరికంటే ఎక్కువ మంది కాల్పులు జరిపారా? అన్న సంగతి తెలియాల్సి ఉంది.
శనివారం తెల్లవారుజామున 2.55 గంటలకు ఈ ఘటన జరిగినట్లు తెలుస్తున్నది. బెవర్లీ హిల్స్‌లో 2700 బ్లాక్ ఆఫ్ ఎల్లిసన్ డ్రైవ్ వీధిలో ఘటన జరిగింది. ఘటనా స్థలంలో లాస్ ఏంజిల్స్ పోలీసులు కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. క్షతగాత్రులను స్థానిక దవాఖానలకు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనకు పాల్పడిన వారిని కనిపెట్టేందుకు ఈ ప్రాంతాన్ని పోలీసులు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. పలు ఎల్ఏపీడీ వెహికల్స్‌ను భారీగా మోహరించారు. మొంటెరేయ్ పార్క్ వద్ద జరిగిన కాల్పుల్లో 11 మంది తీవ్రంగా గాయపడ్డ వారం రోజుల తర్వాత లాస్ ఏంజిల్స్‌లో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. తర్వాత మూడు రోజులకు హాఫ్మూన్ బే సమీపాన రెండు వ్యవసాయ క్షేత్రాల వద్ద సాయుధుడు జరిపిన కాల్పుల్లో ఏడుగురు వ్యక్తులు మరణించారు.