జాగ్రేబ్: క్రొయేషియా(Croatia)లోని నర్సింగ్ హోమ్‌లో ఓ ఆగంతకుడు కాల్పులకు దిగాడు. ఆ కాల్పుల్లో అయిదుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. జాగ్రేబ్కు తూర్పున ఉన్న దరువార్ నగరంలో ఈ ఘటన జరిగింది. కాల్పుల్లో గాయపడ్డవారికి ప్రస్తుతం చికిత్సను అందిస్తున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి తొలుత పారిపోయాడు. అయితే అతన్ని వెంటనే పోలీసులు పట్టుకున్నారు. ఉదయం 10 గంటల సమయంలో ఓ వ్యక్తి నర్సింగ్ హోమ్‌లోకి వచ్చి కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. కాల్పులు జరిపిన ఆగంతకుడు 1973లో పుట్టినట్లు తెలుస్తోంది. 1991 నుంచి 95 మధ్య జరిగిన క్రొయేషియా యుద్ధంలో అతను ఫైటర్‌గా చేశాడు. నర్సింగ్ హోమ్ నడుపుతున్న వ్యక్తికి అతను బంధువు అని తేలింది. స్లావోనియాలోని దారువార్ మున్సిపాల్టీలో సుమారు 8500 జనాభా ఉంటుంది. దాడికి దారి తీసిన కారణాల గురించి పోలీసులు అన్వేషిస్తున్నారు.