LPG tanker : మధ్యప్రాచ్యం (Middile East) లో యుద్ధం కారణంగా ఇంధన సరఫరాపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ (India) కు మరింత ఊరట లభించింది. తీవ్ర ఉద్రిక్తతల నడుమ ఉన్న హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) గుండా భారీ ఎల్పీజీ ట్యాంకర్ (LPG tanker) గ్రీన్ సాల్వి (Green Salvi) భారత్‌కు బయలుదేరింది. ఈ పరిణామం దేశీయ వంటగ్యాస్ సరఫరాలకు కొంత ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
గ్రీన్ సాల్వి ఏకంగా 46,000 మెట్రిక్ టన్నులకుపైగా ఎల్పీజీతో భారత్ వైపు వస్తోంది. గ్రీన్ సాల్వి మరో రెండు భారత ఎల్పీజీ నౌకలకు నాయకత్వం వహిస్తూ.. ఒక కాన్వాయ్‌గా వస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి హర్మూజ్ జలసంధిని విజయవంతంగా దాటిన ఏడో భారత నౌక గ్రీన్ సాల్వి కావడం గమనార్హం. భారత్, ఇరాన్ మధ్య దౌత్యపరమైన సమన్వయం కారణంగానే ఇది సాధ్యమైంది. న్యూఢిల్లీ, టెహ్రాన్ మధ్య జరిగిన చర్చల ఫలితంగా భారత్‌ను ‘మిత్ర దేశం’గా పరిగణిస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది.
ఈ నేపథ్యంలో ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నేవీ మన నౌకలు సురక్షితంగా వెళ్లేందుకు అనుమతి ఇస్తూ మార్గాన్ని సులభతరం చేసింది. ప్రస్తుతం ఈ నౌకలు ఇరాన్ నియంత్రణలోని ఉత్తర మార్గానికి బదులుగా.. ఒమన్ తీరానికి దగ్గరగా ఉన్న సురక్షితమైన దక్షిణ మార్గంలో ప్రయాణిస్తున్నాయి. కాగా ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు ప్రారంభించినప్పటి నుంచి పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
ఈ సంక్షోభం ప్రపంచ ఇంధన సరఫరా గొలుసులపై తీవ్ర ప్రభావం చూపింది. గల్ఫ్ దేశాల నుంచి చమురు, గ్యాస్ దిగుమతులపై ఆధారపడే భారత్ లాంటి దేశాల్లో ఇది తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో భారత నౌకలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సురక్షితంగా రావడం దేశ ఇంధన భద్రతకు సానుకూల సంకేతంగా చెప్పవచ్చు. ఇవేగాక మరో రెండు భారత ఎల్పీజీ నౌకలు కూడా త్వరలోనే ఈ జలసంధిని దాటనున్నాయి.