న్యూయార్క్, అక్టోబర్ 21: పిల్లలు తెలివితేటలు ఎలా ఉంటాయో పిండంగా ఉన్నప్పుడే గుర్తిస్తామని చెప్తున్నది హెలియోస్పెక్ట్ జీనోమిక్స్ అనే అమెరికన్ అంకుర సంస్థ. తల్లిగర్భంలో ఉన్నప్పుడు పిండానికి పరీక్షలు నిర్వహిస్తున్నది. జన్యు మార్పిడి నైతికతపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ ఈ సంస్థ అందిస్తున్న ఈ వివాదాస్పద సేవల విషయం బయటపడింది. యూకేకు చెందిన ‘హోప్ నాట్ హేట్’ అనే సంస్థ రహస్యంగా ఈ బాగోతాన్ని బట్టబయలు చేసింది. సంపన్నులైన దంపతులు వారికి పుట్టబోయే బిడ్డ తెలివితేటలు భవిష్యత్తులో ఎలా ఉంటాయి, ఆరోగ్యం ఎలా ఉంటుంది, పుట్టబోయే బిడ్డ అమ్మాయా, అబ్బాయా వంటి విషయాలను పిండాన్ని పరీక్షించడం ద్వారా గుర్తిస్తామని ఈ సంస్థ చెప్తున్నది. ఇందుకు గానూ యూకే బయోబ్యాంక్ డాటాను ఉపయోగిస్తున్నట్టు అంగీకరించింది. పిండాన్ని పరీక్షించేందుకు ఒక్కో దంపతుల నుంచి 4 వేల డాలర్లు వసూలు చేస్తున్నది. అయితే, ప్రస్తుతం తమ సేవలు పరీక్షల దశలోనే ఉన్నాయని, పూర్తిస్థాయిగా ప్రారంభించలేదని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.