Natural forces | న్యూయార్క్: కంటికి కనిపించిన ప్రతిదీ నిజమూ కాదు.. కనిపించనంత మాత్రాన అబద్ధం కాదు. సైన్స్‌కు అందని ఎన్నో అద్భుతాలు, అంతుచిక్కని సవాళ్లు, సమస్యలు ప్రకృతిలో ఉన్నాయి. ఇప్పటి వరకు ఫిజిక్స్ పరంగా వెలుగులో ఉన్న నాలుగు శక్తులు (ఫోర్స్) కాకుండా ప్రకృతిలో మరో శక్తి దాగి ఉందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఆ అదృశ్య ఐదో శక్తి ఓ పరమాణువును ప్రభావితం చేస్తున్నదని, దాన్ని నియంత్రిస్తున్నదని వారు విశ్వసిస్తున్నారు. అమెరికా ఇల్లినాయిస్లోని ఫెర్మి నేషనల్ యాక్సిల్రేటర్ ల్యాబొరేటరీ (ఫెర్మిల్యాబ్)లో దీనిపై వారు అధ్యయనం చేస్తున్నారు. మ్యూయాన్స్ (ఎలక్ట్రాన్స్ లాంటివి) అనే ఉప పరమాణు కణాలు ‘ఉప పరమాణు భౌతికశాస్త్రం’ ప్రకారం ప్రవర్తించడం లేదని వారు కనుగొన్నారు. ఈ కణాలు ప్రస్తుతం ప్రపంచానికి తెలిసిన నాలుగు శక్తుల ప్రభావానికి లోనవడం లేదని గుర్తించారు. అదృశ్య శక్తి వాటిని ప్రభావితం చేస్తున్నదని, దాన్ని నియంత్రిస్తున్నదని.. దీనికి మరిన్ని ఆధారాలు కావాలని పరిశోధకులు భావిస్తున్నారు.
గురుత్వాకర్షణ, విద్యుదయస్కాంత, స్ట్రాంగ్ (బలమైన), వీక్ (బలహీనమైన) ఫోర్స్.. ఇవే ఇప్పటి వరకు మనకు తెలిసిన శక్తులు. ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు, అణువు, పరమాణువు ఈ నాలుగు శక్తులను ఉపయోగించుకొని ఒకదానితో మరొకటి ఇంటరాక్ట్ (సంకర్షణ) అవుతాయి. కానీ ఫెర్మిల్యాబ్ శాస్త్రవేత్తలు ఇవి కాకుండా ఐదో శక్తి కూడా ఉందనే వాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఇందుకు గానూ మ్యూయాన్స్పై వారు చేసిన పరిశోధనలను ఉదహరిస్తున్నారు. ఫెర్మిల్యాబ్లో 15 మీటర్ల వ్యాసం గల రింగుపై మ్యూయాన్లపై పరిశోధనలు చేయగా.. అవి ప్రస్తుత భౌతిక సిద్ధాంతాల ప్రకారం ప్రవర్తించలేదు. వాటిని మరో శక్తి నియంత్రించినట్టు పరిశోధకులు గుర్తించారు. కానీ ఐదో శక్తిని ధ్రువీకరించేందుకు మరో రెండేండ్లు పట్టవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. మరోవైపు యూరప్‌లోని లార్జ్ హడ్రన్ కొలిడర్ (ఎల్‌హెచ్‌సీ) సైతం దీనిపై పరిశోధనలు సాగిస్తున్నది. అయితే ఐదో శక్తి ఉన్నదన్న వాదన 2021లోనూ తెరపైకి రావడం గమనార్హం.
మ్యూయాన్లు అనేవి ఓ రకమైన ఎలక్ట్రాన్స్. ఇవి అస్థిరమైన ఉప పరమాణు కణాలు. కానీ ఎలక్ట్రాన్స్‌తో పోలిస్తే వీటి ద్రవ్యరాశి 200 రెట్లు ఎక్కువగా ఉంటుంది. భూమి ఉపరితలంపై చేరే కాస్మిక్ రేడియేషన్‌లో ఇవి ఎక్కువగా ఉంటాయి.