న్యూయార్క్, సెప్టెంబర్ 30: అసలు ఇంధనం అన్నదే లేకుండా ప్రపంచాన్ని చుట్టేసే వాహనం ఉంటే ఎంత బాగుణ్ణు అన్న ఆలోచనను నిజం చేశారు యూరో శాస్త్రవేత్తలు. ఏ ఇంధనం అవసరం లేకుండానే సున్నా ఉద్గారాలతో పనిచేసే సోలార్ ఎయిర్‌షిప్‌ను తయారు చేశారు. ఇది భూమధ్యరేఖ చుట్టూ దాదాపు 40 వేల కిలోమీటర్లు కేవలం 20 రోజుల్లో సున్నా ఉద్గారాలతో చుట్టేసి వస్తుంది.
495 అడుగుల పొడవున్న ఈ ఎయిర్‌షిప్ ఉపరితలం మొత్తం సోలార్ ఫిల్మ్‌తో కప్పి ఉంటుంది. సోలార్ ఫిల్మ్ ద్వారా సూర్యరశ్మిని స్వీకరించి ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్స్ ద్వారా ఎయిర్‌షిప్ నడుస్తుంది. అలాగే పగలు తయారు చేసిన అదనపు విద్యుత్‌ను హైడ్రోజన్‌గా మార్చడంతో రాత్రిపూట కూడా దీని పయనానికి ఎలాంటి ఆటంకం ఏర్పడదు. ముగ్గురు సిబ్బందితో నడిపే ఈ ఎయిర్‌షిప్ గంటకు 83 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడమే కాక ఒక కార్గో విమానం కంటే 8-10 రెట్ల సరుకును రవాణా చేయగలదు.