Online Game | న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: ఆన్లైన్ గేమ్‌లో జరిగిన ఘటనలు సైతం నిజంగానే తనకు జరిగినట్టు భావించాడు చైనాకు చెందిన ఒక వ్యక్తి. గేమ్‌లో వేలసార్లు చెంపదెబ్బలు తిని అవమానాన్ని ఎదుర్కొన్నానని పేర్కొంటూ ఒక వ్యక్తి గేమింగ్ కంపెనీపై కేసు దాఖలు చేశాడు. ‘థ్రీ కింగ్డమ్స్ కిల్’ అనే ఆన్లైన్ గేమ్‌కు 15 సంవత్సరాలుగా అభిమాని అయిన ఆ వ్యక్తి ఆటలో భాగంగా తాను 4,800 సార్లకు పైగా చెంపదెబ్బలు తిన్నానని, అది తనను అవమానానికి గురి చేయడమే కాక, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిందని తెలిపాడు.
కియాబెన్ అనే మారుపేరును వాడే ఆ వ్యక్తి ఆటలో ఉత్తమ ర్యాంక్‌ను కలిగి ఉన్నాడని జిన్ హువాంగే అనే సంస్థ తెలిపింది. ఆన్లైన్ ఆటలో విజయం సాధించిన ప్రతిసారి తన ప్రత్యర్థులు గుడ్లు, గడ్డి, పాదరక్షలు లాంటివి తన అవతార్‌పై విసరడాన్ని కియాబెన్ గమనించాడు. ఆ చర్యలు తనను చెంపదెబ్బ కొట్టిన బాధను కలిగించాయని ఆయన పేర్కొన్నాడు.