Pakistan | పాకిస్థాన్ (Pakistan)లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. కరాచీ (Karachi)లోని పోలీస్ చీఫ్ (Police chief) కార్యాలయంలోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, జాతీయ భద్రత అధికారులు సంఘటన స్థలానికి చేరకున్నారు. ఈ సందర్భంగా తెహ్రీక్-ఇ-తాలిబన్ (Tehreek-e-Taliban (Pakistan))ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.
పాకిస్థాన్ మీడియా సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం.. కరాచీలోని షరియా ఫైసల్ (Sharea Faisal )ప్రాంతంలో ఉన్న ఈ పోలీస్ చీఫ్ కార్యాలయంలోకి శుక్రవారం సాయంత్రం సమయంలో 8 మంది ఉగ్రవాదులు చొరబడ్డారు. అనంతరం విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ సందర్భంగా ఉగ్రవాదులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు సహా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు, ఓ పౌరుడు, రేంజర్ సిబ్బంది ఉన్నారు. మరో 17 మంది గాయపడ్డారు.
కాగా, కరాచీ పోలీసు చీఫ్ ఆఫీసుకు సమీపంలో ఓ అనుమానాస్పద కారును అధికారులు గుర్తించారు. ఈ కారులోనే ఉగ్రవాదులు నగరంలోకి ప్రవేశించి ఉంటారని భావిస్తున్నారు. పోలీసు చీఫ్ ఆఫీసు వెనుక ఉన్న మసీదుకు సమీపంలో ఈ కారును నిలిపి ఉంచారు. కారును సీజ్ చేసిన భద్రతాదళాలు బాంబు స్క్వాడ్‌ను రంగంలోకి దింపాయి.
గత నెల 30న పాకిస్థానీ తాలిబన్లు పెషావర్‌లోని ఓ మసీదులో పేలుడుకు పాల్పడిన విషయం తెలిసిందే. భద్రతా సిబ్బందే లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో పాకిస్థాన్‌లోని అన్ని ప్రావిన్సుల్లో చెక్పాయింట్లను పటిష్టం చేసి, అదనపు బలగాలను మోహరించారు.