ఇస్లామాబాద్: ముంబై ఉగ్ర దాడుల సూత్రధారి, జమాత్ ఉద్ దావా ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్‌కు పాకిస్థాన్ కోర్టు 31 ఏళ్లు జైలు శిక్ష విధించింది. రెండు కేసులకు సంబంధించి ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. అలాగే రూ.3,40,000 జరిమానా కూడా విధించింది. హఫీజ్ సయీద్‌కు చెందిన ఆస్తులన్నీ సీజ్ చేయాలని పాక్ కోర్టు ఆదేశించింది. దీంతో ఆయన నిర్మించిన మసీదు, మదర్సాను అధికారులు స్వాధీనం చేసుకోనున్నట్లు తెలుస్తున్నది. ఉగ్రవాద ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన కేసుల్లో 70 ఏండ్ల హఫీజ్ సయీద్‌కు పలు సార్లు జైలు శిక్షలు పడ్డాయి. 2020లో టెర్రర్ ఫండింగ్ కేసులో యాంటీ టెర్రర్ కోర్టు 15 ఏళ్లు జైలు శిక్ష విధించింది.
కాగా, 2008 నవంబర్ 26న మహారాష్ట్రలోని ముంబైలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన పది మంది ఉగ్రవాదులు సముద్ర మార్గంలో బోటు ద్వారా ముంబైలోకి చొరబడ్డారు. ముంబై రైల్వే స్టేషన్, తాజ్ హోటల్‌తోపాటు పలు చోట్ల సాధారణ ప్రజలు, పోలీసులపై ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. నవంబర్ 29 వరకు జరిగిన 9 దాడుల్లో 175 మంది మరణించారు. 300 మందికిపైగా గాయపడ్డారు. ఉగ్రవాది కసబ్‌ను సజీవంగా పట్టుకున్నారు. కోర్టు ఉరి శిక్ష విధించడంతో 2012 నవంబర్ 21న పూణేలోని ఎరవాడ జైలులో ఉరి తీశారు.