Canada | ఒట్టావా: ఇండ్ల సంక్షోభం నెలకొన్న కెనడాలో విదేశీ విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉన్నది. ఉన్నత విద్య అభ్యసించేందుకు అక్కడకు వెళ్లిన వారికి ఇండ్లు దొరకడం కష్టతరంగా మారింది. ఇటీవల బ్రాంప్టన్ పట్టణంలోని ఒక అద్దె భవనంపై దాడులు చేసిన అధికారులు.. ఆ భవనం బేస్మెంట్లో ఏకంగా 25 మంది విద్యార్థులు నివసిస్తున్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో నగర మేయర్ పాట్రిక్ బ్రౌన్ కీలక నిర్ణయం తీసుకొన్నారు. యజమానులు తమ రెంటల్ ప్రాపర్టీలను నగర కౌన్సిల్ వద్ద తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకొనేలా ఒక చట్టం తీసుకురానున్నట్టు వెల్లడించారు.
నగరంలో ఇలాంటి అక్రమ అద్దె కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సింగిల్ యూనిట్‌ను డజన్ల మంది విదేశీ విద్యార్థులకు అద్దెకు ఇవ్వడం ద్వారా యజమానులు భద్రతా ప్రమాణాలను విస్మరిస్తున్నారని పేర్కొన్నారు. తద్వారా విద్యార్థులు ప్రమాదకరమైన పరిస్థితుల్లో జీవించేలా చేస్తున్నారని అన్నారు. అలాంటి యాజమానులపై తగిన చర్యలు తీసుకొంటామని మేయర్ హెచ్చరించారు. బ్రాంప్టన్‌లో గణనీయమైన సంఖ్యలో భారతీయ వలసదారులు నివసిస్తుంటారు.