దోహా : ఖతార్‌లోని ప్రముఖ రాస్ లఫాన్ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్(ఎల్ఎన్సీ) పరిశ్రమలో సంభవించిన భారీ పేలుడులో 13 మంది మృతిచెందగా, మరో 66 మంది గాయపడ్డారు. మృతుల్లో 12 మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తున్నది. ఇరాన్ జరిపిన క్షిపణి దాడి కారణంగా నిలిచిపోయిన కార్యకలాపాలను కార్మికులు పునరుద్ధరిస్తున్న సమయంలో ఈ పేలుడు చోటుచేసుకుంది. ‘బర్జాన్’ గ్యాస్ సరఫరా విభాగంలో ఈ ప్రమాదం జరిగిందని, ఇది ఒక సాంకేతిక ప్రమాదం అని అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై దోహాలోని భారత రాయబార కార్యాలయం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా, మరికొందరు అదృశ్యమయ్యారని పేర్కొన్నది. కాగా ఇండస్ట్రియల్ కాంప్లెక్స్‌కు 70 కిలోమీటర్ల దూరంలోని సెంట్రల్ దోహాలో ఈ పేలుడు ధాటికి కిటికీలు కంపించాయని, స్థానికులు భయాందోళనలకు గురయ్యారని సమాచారం. ఈ ప్రమాదం కారణంగా ఖతార్ ఎల్ఎన్సీ ఎగుమతి సామర్థ్యానికి ఎలాంటి ఆటంకం లేదని, పర్యావరణానికి ఎటువంటి హాని జరుగలేదని ఖతార్ ఇంధన మంత్రిత్వశాఖ తెలిపింది.