ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో (Pakistan) ఆర్థిక సంక్షోభం రోజురోజుకు తీవ్రమవుతున్నది. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోవండంతో ప్రజల పరిస్థితి దారుణంగా తయారవుతుంది. సామాన్యులు తమ కనీస అవసరాలు తీర్చుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలకు తిండి దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రావిన్స్‌లో (Punjab province) ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న పిండిని (Free Flour) తీసుకోవడానికి జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. అదికాస్తా తొక్కిసలాటకు దారితీయడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్‌లోని సహివాల్, బహవాల్పూర్, ముజఫర్‌గఢ్, ఒఖారా ప్రాంతాలపోటు, ఫైసలాబాద్, జెహానియాన్, ముల్తాన్ జిల్లాల్లో తొక్కిసలాట ఘటనలు చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 60 మందికిపైగా గాయపడ్డారని చెప్పారు.
దేశంలో ద్రవ్యోల్బణం 50 ఏండ్ల రికార్డు స్థాయికి చేరింది. దీంతో నిత్యావసరాల ధరలు చుక్కలను అంటుతున్నాయి. అయితే పవిత్ర రంజాన్ మాసం కావడంతో ప్రజలు తమకు కావాల్సిన వస్తువులను కొనకుండా ఉండలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ధరాభారం నుంచి కొద్దిగానైనా ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం ఉచితంగా గోధుమ పిండిని సరఫరా చేస్తున్నది.
దీంతో ప్రజలు పిండి కోసం ఎగబడుతున్నారు. పంపిణీ కేంద్రాలు తక్కువగా ఉండటం, నిర్ణీత సమయంలోనే పంపిణీ చేస్తుండటంతో వాటిని దక్కించుకునేందుకు పోటీపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పంపిణీ కేంద్రం వద్దకు రాకముందే స్థానికులు లారీని దోచుకెళ్తున్నారు.