బంజారా హిల్స్, మార్చి 29: బైక్ లేదని తరచూ బాధపడే స్నేహితుడి కండ్లల్లో ఆనందం చూసేందుకు ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసి గిఫ్ట్‌గా ఇచ్చిన యువకుడు కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కార్ఖానాకు చెందిన మహమ్మద్ రియాజ్ (19) కు మైనర్ (17) స్నేహితుడు ఉన్నాడు. రియాజ్‌కు సొంత బైక్ ఉండగా మైనర్‌కు లేదు.
తనకు బైక్ కొనే స్థోమత లేదని తరచూ చెబుతూ బాధపడుతుండేవాడు. ఎలాగైనా స్నేహితుడికి బైక్ ఇప్పించాలనే ఆలోచనతో ఉన్న రియాజ్ ఈ నెల 25న షేక్‌పేట్ ఫాల్కన్ వ్యాలీలో ఉండే మహమ్మద్ జాహూర్ అనే ఈవెంట్ మేనేజర్ హోండా డ్యూయోను తస్కరించాడు. మరుసటి రోజు ఉదయాన్నే వెళ్లి స్నేహితుడైన మైనర్ కు బైకును గిఫ్ట్ గా ఇచ్చాడు. అయితే బైక్ యజమాని మహమ్మద్ జాహూర్ బైక్ పోయిందని ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజ్ సాయంతో చోరీకి పాల్పడిన రియాజ్‌ను గుర్తించి శనివారం అరెస్ట్ చేశారు. మైనర్‌ను మాత్రం జువైనల్ హోమ్ కు తరలించారు.