శంషాబాద్ రూరల్, ఆగస్టు 24: భారత్ నుంచి క్రికెట్లో ప్రపంచ ఛాంపియన్లు వచ్చినట్టే బాడీ బిల్డింగ్లోనూ రావాలని సినీ నటుడు అల్లు శిరీష్ ఆకాంక్షించారు. శంషాబాద్ పట్టణంలోని ఎస్ఆర్ క్లాసిక్ కన్వెన్షన్ హాల్లో రెండు రోజుల పాటు నిర్వహించిన ‘డెక్కన్ అప్రైజింగ్ -2025’ బాడీ బిల్డింగ్ పోటీలు(సహజ బాడీ బిల్డింగ్) ఆదివారం ముగిశాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సినీ నటుడు అల్లు శిరీష్ మాట్లాడుతూ.. దేశంలో బాడీ బిల్డింగ్ అనగానే స్టెరాయిడ్తో బాడీ బిల్డ్ చేస్తారన్న ఆపోహ ఉందన్నారు.
కానీ ఐసీఎన్ మాత్రం అందుకు విరద్ధంగా నిలుస్తుందన్నారు. ఇది ప్రపంచంలోనే సహజ బాడీ బిల్లిండ్ పోటీ అన్నారు. హైదరాబాద్లోనే 450 మందికి పైగా ఎసీఎన్ అథ్లెట్లు ఉన్నారంటే ఆశ్చర్యకరంగా ఉందన్నారు. సహజ సిద్ధమైన బాడీ బిల్డింగ్ కమ్యూనిటీ నిరంతరం విస్తరిస్తూ ముందుకు సాగుతుందని ఆయన వివరించారు. ఇందులో మహిళలు సైతం పాల్గొని విజేతలుగా నిలవడం ఆనందంగా ఉందన్నారు. గెలుపొందిన వారిని అభినంధించారు. ఈ కార్యక్రమంలో ఐసీఎన్ ఇండియా, యూఏఈ అధ్యక్షుడు జే.ఆచార్యతో పాటు పలువురు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.