ఖైరతాబాద్, ఏప్రిల్ 16 : ఎర్రమంజిల్‌లోని పీవీఆర్ మాల్లో పనిచేసే ఓ వర్కర్ అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఈ ఘటన పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. నగరానికి చెందిన సత్యనారాయణ (40) ఎర్రమంజిల్‌లోని పీవీఆర్ మాల్లో హౌజ్ కీపింగ్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. బుధవారం విధులకు వచ్చిన సత్యనారాయణ తనకు అస్వస్థతగా ఉందని, చాతిలో నొప్పి వస్తున్నదని, సెలవు కావాలని అడిగాడు. అందుకు నిరాకరించడంతో అలాగే డ్యూటీ చేశాడు.
గురువారం తెల్లవారుజామున ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలో పడిపోయాడు. దీంతో యాజమాన్యం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూసేసరికి మృతదేహం పీవీఆర్ మాల్ ఫుట్‌పాత్‌పై ఉండటాన్ని గమనించి యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హుటాహుటిన ఉస్మానియా దవాఖానకు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని తీసుకొని తిరిగి పీవీఆర్ మాల్‌కు తీసుకువచ్చి ఆందోళన చేపట్టారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే సత్యనారాయణ మృతి చెందాడంటూ బంధువులు ఆరోపించారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న అడిషనల్ డీసీపీ, ఏసీపీలు కుటుంబ సభ్యులకు సర్దిచెప్పే ప్రయత్నించగా, వారు ససేమిరా అన్నారు.
ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. మృతుడి కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని సీఐటీయు నాయకులు డిమాండ్ చేయగా, రూ.50వేలు ఇచ్చి మరేదైనా సాయం చేస్తామని చెప్పడంతో బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల జోక్యంతో మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ దవాఖానకు తరలించారు. అనంతరం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శంషాబాద్ రూరల్, ఏప్రిల్ 16 ః శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఓ ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు భారీగా విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్న ఘటన గురువారం జరిగింది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి హాంకాంగ్ వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికుడి కదలికలపై అనుమానం వచ్చిన అధికారులు అతడిని తనిఖీలు చేయగా అతడి వద్ద రూ 45 లక్షల విలువైన విదేశీ కరెన్సీని పట్టుకున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా పెద్ద మొత్తంలో విదేశీ నగదు తీసుకుపోవడం కోసం యత్నించిన వ్యక్తిని అరెస్టు చేసి అతడి వద్ద ఉన్న 45లక్షల రూపాయల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విదేశీ నగదు తరలింపు వెనుక ఎవరున్నారు అనే కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.