నగరంలో ట్రాఫిక్ చిక్కులకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ప్రారంభించిన వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఆర్డీపీ) సత్ఫలితాలిస్తున్నది. ఈ ప్రాజెక్టు కింద ఇప్పటికే పదుల సంఖ్యలో ఫ్లెఓవర్లు, అండర్‌పాస్‌లు పూర్తికాగా, హైదరాబాద్-విజయవాడ మార్గంలో ఎల్బీనగర్
చౌరస్తా వద్ద నిర్మించిన అండర్‌పాస్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. పనులు ఆఖరిదశకు చేరుకుంటుండడంతో ఫిబ్రవరి రెండోవారంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎడమవైపు అండర్‌పాస్ అందుబాటులోకి
రాగా, కుడివైపు 13 మీటర్ల వెడల్పు, 490 మీటర్ల పొడవుతో కామినేని హాస్పిటల్ ఫ్లైఓవర్‌కు అనుసంధానంగా ఈ అండర్‌పాస్‌ను తీర్చిదిద్దుతున్నారు. రూ.14.87 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ అండర్‌పాస్ వినియోగంలోకి వస్తే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆరాంఘర్, మిధాని మీదుగా వచ్చే వాహనాలు ఎల్బీనగర్ వద్ద సులువుగా దాటే అవకాశం ఉంది. అలాగే తుకారాంగేట్ రైల్వే అండర్‌పాస్ పనులు పూర్తి కావొస్తుండడంతో వచ్చే
నెలాఖరులో, బహుదూర్‌పురా ఫ్లెఓవర్‌ను మార్చిలో అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు వేగవంతం చేశారు.
సిటీబ్యూరో, జనవరి 30 (నమస్తే తెలంగాణ): నగర రోడ్లు ట్రాఫిక్ ఫ్రీగా మారుతున్నాయి. రాష్ట్ర ఏర్పాటుకు ముందు రోడ్డెక్కితే ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుని ఎప్పుడు ఇంటికి చేరుతామో తెలియని పరిస్థితి ఉండేది. ప్రతి సిగ్నల్ వద్ద కిలోమీటర్ల దూరం వాహనాలు బారులు తీరేవి. లీటర్ల కొద్ది పెట్రోల్, గంటల కొద్దీ సమయం వృథా అయ్యేది. నేడు వరుసగా అందుబాటులోకి వస్తున్న ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లతో వాహనదారులు నిమిషాల్లో గమ్యం చేరుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తీరని ట్రాఫిక్ కష్టాలు స్వరాష్ట్రంలో తీరుతున్నాయని సంబురపడుతూ.. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. హైదరాబాద్‌ను సిగ్నల్ ఫ్రీ రహదారుల నగరంగా మార్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి (ఎస్ఆర్డీపీ) కార్యక్రమం ట్రాఫిక్ పద్మవ్యూహాలను చీల్చుకుంటూ సాకారమవుతుండటంతో నగర వాసులు ఊరట పొందుతున్నారు. ఇప్పటికే అనేక చోట్ల భారీ వంతెనలు, అండర్‌పాస్‌లు అందుబాటులోకి రాగా తాజాగా ఎల్బీనగర్లో మరో అండర్‌పాస్ ప్రారంభోత్సవానికి ముస్తాబవుతుంది. నిర్మాణ పనులు పూర్తి చేసిన జీహెచ్ఎంసీ అధికారులు తుది మెరుగులు దిద్దుతున్నారు. వచ్చే నెల రెండవ వారంలో ఈ అండర్‌పాస్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
రూ.14.87కోట్ల వ్యయంతో నిర్మాణం
రహదారుల వ్యవస్థను మరింత మెరుగు పరిచి ట్రాఫిక్ సమస్య నివారణకు నిర్ధిష్టమైన ప్రమాణాలతో జీహెచ్ఎంసీ ముందుకు సాగుతున్నది. రోడ్లు, అండర్ పాస్‌లు, ఫ్లై ఓవర్లు, ఆర్వోబీ నిర్మాణాలు చేపట్టి రహదారుల వ్యవస్థను అంచెలంచెలుగా అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తున్నది. ఎస్ఆర్డీపీ కింద పలు ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు అధికారులు అవసరమైన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఎల్బీనగర్ కూడలి వద్ద ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు అండర్ పాస్, ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు చేపట్టారు. ఎల్బీనగర్ కూడలి (ఆర్హెచ్ఎస్) కుడి వైపున రూ.14.87 కోట్ల వ్యయంతో నిర్మించిన 490 మీటర్ల పొడవు గల అండర్ పాస్ పనులు పూర్తయ్యాయి.
అండర్‌పాస్ రాకతో బహుళ ప్రయోజనాలు
12.875 మీటర్ల వెడల్పు, 7250 మీటర్ల బాక్స్ పోర్షన్,3 లైన్ల యూని డైరెక్షన్లో చేపట్టిన అండర్ పాస్ అందుబాటులోకి రానుండటంతో వాహనదారులు సంబురపడుతున్నారు. ముఖ్యంగా అండర్ పాస్ అందుబాటులోకి వస్తే ఉప్పల్ నుంచి మిథాని వరకు ట్రాఫిక్ సమస్య లేకుండా వెళ్లవచ్చు. అదేవిధంగా ఆరాంఘర్ నుంచి ఎల్బీనగర్ వరకు వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నేరుగా వెళ్లేందుకు వీలుగా ఫ్లై ఓవర్ల నిర్మాణాలు జరిగాయి. కాగా వచ్చే నెల చివరి వారంలో తుకారాం గేట్ రైల్వే అండర్ పాస్, మార్చి నెలలో బహదూర్‌పుర ఫ్లై ఓవర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.