సుల్తాన్‌బజార్, డిసెంబర్ 18 : మహిళా వర్సిటీలో ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ సిబ్బంది వేతనాలను పెంచి న్యాయం చేయాలని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వ విద్యాలయం నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం కోఠిలోని మహిళా వర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ నాయకులు మహేందర్, ప్రశాంత్, శేఖర్లు మాట్లాడుతూ వర్సిటీలో ఏన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్న బోధనేతర సిబ్బంది పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతమని అన్నారు. నిత్యావసర సరుకుల ధరలు, ఫీజులు పెరుగుతున్నా తమ వేతనాలు మాత్రం ఇంకా పెరగడం లేదని వాపోయారు. చాలీ చాలని జీతాలతో బతుకులను నెట్టుకొస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలను పెంచాలని పలు మార్లు మాజీ వీసీని అడిగినా ప్రయోజనం లేకపోవడంతో, ప్రస్తుత వీసీని అడిగామని మీ ఇష్టం ఉంటే చేయండి లేదా వెళ్ళిపొండి అని ముఖం మీదే చెబుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
గత సంవత్సరన్నర కాలంలో సుమారు 70 మందిని నూతనంగా నియమించి రూ.30వేల వరకు వేతనాలను చెల్లించడం పట్ల వారు మండిపడ్డారు. ఏళ్ల తరబడి కాంట్రాక్ట్ పద్ధతిన పని చేస్తున్న బోధనేతర సిబ్బందికి మాత్రం రూ.12 వేలు, నూతనంగా నియమితులైన వారికి మాత్రం రూ.30వేల వరకు జీతాలు అందిస్తున్నారన్న విషయంపై అధికారులను అడిగితే తక్కువ జీతానికి ఎవరు చేస్తారని అందుకే అధికంగా చెల్లిస్తున్నామని తెలుపారన్నారు.
ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ పద్దతిన పనిచేస్తున్న 170 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ వేతనాలు పెంచాలని కోరినా, ప్రశ్నించినా తమపై బెదిరింపులకు పాల్పడుతూ భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. దీంతో చారిత్రాత్మక నేపథ్యం కలిగిన మహిళా వర్సిటీలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని తెలిసినా భయంతో ఎవ్వరూ ముందుకు రావడం లేదన్నారు. తక్షణమే వర్సిటీ వీసీ ఈ విషయమై ప్రత్యేక చొరవ తీసుకొని నాన్ టీచింగ్ స్టాఫ్ వేతనాలను పెంచి న్యాయం చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఇదిలా ఉండగా వర్సిటీ అసిస్టెంట్ రిజి స్ట్రార్ సౌమ్య కాంట్రాక్ట్ సిబ్బందిపై బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు.