ఖైరతాబాద్, మే 20 : రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై అలుపెరగని పోరాటాలను నిర్వహిస్తామని తెలంగాణ జాగృతి మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు మారిపెల్లి మాధవి తెలిపారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర నూతన అధ్యక్షురాలిగా మారిపెల్లి మాధవిని ఈ నెల 16వ తేదీన జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నియమించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1లోని మహేశ్వరి టవర్స్‌లో మంగళవారం నాడు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవిని విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్, రిసోర్స్‌పర్సన్ గౌరవ అధ్యక్షులు ఎల్. రూప్సింగ్, మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు, సభ్యులు ఘనంగా సత్కరించారు.
అనంతరం మారిపెల్లి మాధవి మాట్లాడుతూ.. వీఓఏ రంగానికి తాను అందించిన సేవలను గుర్తించి అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రుణపడి ఉంటానని తెలిపారు. ఆమె పోరాట స్ఫూర్తితో మహిళా సమస్యలపై గళమెత్తుతానని పేర్కొన్నారు. రూప్సింగ్ మాట్లాడుతూ.. వీఓఏ రంగాన్ని రాష్ట్ర వ్యాప్తంగా బలమైన నిర్మాణం చేసిన మాధవి పనితనాన్ని గుర్తించి ఆమెకు అధ్యక్షురాలిగా నియమించడం హర్షణీయమని, అదే స్ఫూర్తితో తెలంగాణ మహిళా సమాజానికి మార్గదర్శి కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.