సిటీబ్యూరో, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ ) : మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం స్టాండింగ్ కమిటీ సమావేశం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల రూంలో జరిగింది. ఈ సమావేశంలో 32 అంశాలు, ఏడు టేబుల్ అంశాలకు సభ్యులు ఆమోదించినట్లు మేయర్ వెల్లడించారు. అంతకు ముందు రామంతాపూర్లో కృష్ణాష్టమి శోభయాత్రలో కరెంట్ షాక్తో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాప సూచకంగా సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు.
నానల్నగర్ వార్డులోని టౌలీచౌకీ ఫ్లై ఓవర్ కింద నిర్మించిన 18 వెడ్డింగ్ షాపులను మూడేండ్ల పాటు టెండర్ కమ్ ఓపెన్ బహిరంగ వేలం ద్వారా అద్దెకు ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. 25 సంవత్సరాల కంటే ఎక్కువ గడువు ముగిసిన ఖాళీ షాపులకు వేలం నిర్వహించేందుకు, గడువు ముగిసిన లీజులను పొడగించడానికి, అద్దె పెంచేందుకు సభ్యులు ఆమోదించారు.
50 కేంద్రాల్లో విజయ డెయిరీ పార్లర్ల ఏర్పాటుకు కమిటీ ఆమోదించింది. 404 ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహణ, కొత్త సిగ్నల్స్ స్థాపనకు రూ. 72.31 కోట్లతో టెండర్లు ఆహ్వానించేందుకు.. ఎల్ఈడీ స్ట్రీట్ లైట్ల ఈఈఎస్ఎల్ టెండర్ పూర్తయినందున ఎల్ఈడీ స్ట్రీట్ లైట్లు, సీసీఎంఎస్ ప్యానళ్ల నిర్వహణ, స్థాపనకు రూ. 897 కోట్లతో టెండర్లు ఆహ్వానించేందుకు కమిటీ ఆమోదం తెలిపింది.