పూర్వం అడవిలో ఆశ్రమ పాఠశాలలు ఉండేవి. కానీ ఇప్పుడు ఓ పాఠశాలలో అడవి రూపుదిద్దుకుంటుంది. చదివేందుకు వింతగా అనిపించినా ఇది అక్షరసత్యం. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం అనే మహాయజ్ఞంలో భాగంగా ఇది సాకారమవుతున్నది. తెలంగాణ ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ఓ అధికారి చిత్తశుద్ధితో చేసిన కృషికి ఫలితంగా ఈ అర్బన్ ఫారెస్ట్ పురుడు పోసుకుంటుంది. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలో అనుకుంటే పొరపాటే.. మహానగర శివారులోని శామీర్‌పేట క్రీడాపాఠశాల వేదికగా సరికొత్త నందనవనం తయారవుతుంది.
సంకల్పం గొప్పది అయితే చేపట్టిన కార్యం తప్పకుండా సఫలీకృతం అవుతుందంటారు. మానవ జీవన ప్రయాణంలో మొక్కది ప్రత్యేక స్థానం. ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం ఒక అధికారి ఆలోచనను మార్చేసింది. ఆయన ఏకంగా లక్ష మొక్కల పెంపకానికి సంకల్పం తీసుకున్నాడు. అనుకున్నదే తడువుగా అందరి సహకారంతో హరితయజ్ఞాన్ని ప్రారంభించాడు. ఎన్నో ఏండ్లుగా వృథాగా ఉన్న వంద ఎకరాల స్థలానికి కొత్త అందాలను తీసుకొచ్చాడు.
తెలంగాణ స్పోర్ట్ స్కూల్ ఓఎస్డీగా హరికృష్ణ ఏడాది కిందట బాధ్యతలు చేపట్టారు. పాఠశాలలో పెద్ద ఎత్తున స్థలం అందుబాటులో ఉండటంతో మొక్కలను పెంచాలని సంకల్పించాడు. 100 ఎకరాల స్థలాన్ని మొక్కల పెంపకానికి అందుబాటులోకి తీసుకువచ్చాడు. ఇందుకు హెచ్ఎండీఏ, అటవీశాఖ అధికారులు సహకారం తీసుకున్నాడు. సమష్టితో కృషితో ఏడాదిలోగానే లక్షకు పైచిలుకు మొక్కలను నాటి, వాటి సంరక్షణకు చర్యలు తీసుకున్నారు.
100 ఎకరాల్లో మొక్కలను పెంచేందుకు క్రీడా పాఠశాలలోనే నర్సరీ ఏర్పాటు చేశారు. హెచ్ఎండీఏ ఎఫ్ఆర్వో మంజుల ఆధ్వర్యంలో 25 లక్షల వివిధ రకాల మొక్కలను సిద్ధం చేశారు. నాణ్యమైన మొక్కలను ఉత్పత్తి చేసి, నాటడంతో 90 శాతం మేరకు మొక్కలు బతికాయి. ఇక్కడ నెలకొల్పిన నర్సరీ హెచ్ఎండీఏ పరిధిలో పలు ప్రాంతాలకు కూడా మొక్కలను అందజేస్తోంది.
వంద ఎకరాల స్థలాన్ని కేవలం నీడను, ఆక్సిజన్ ఇచ్చే మొక్కలకే పరిమితం చేయలేదు. విద్యార్థులకు పోషకాహారాన్ని అందించాలన్న సంకల్పంతో పండ్ల మొక్కలను, ఆహ్లాదం కోసం పూల మొక్కలను నాటారు. రెండు విడతలుగా పది వేల చొప్పున జామ, దానిమ్మ, మామిడి, చింత, బాదాం, పనస, చీమచింత, మల్బరీ, సీతాఫలం, రామఫలం తదితర 20వేల పండ్ల మొక్కలను నాటారు. మనస్సును ఆహ్లాదం కలిగించే రంగు రంగుల పూల మొక్కలను పాదుకొల్పారు. మరికొంత కాలంలో క్రీడా పాఠశాలకు ఉన్న 200 ఎకరాల్లో 100 ఎకరాల దట్టమైన అడవిగా మారే పరిస్థితి కన్పిస్తోంది.
తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో లక్షకు పైచిలుకు మొక్కలను పెంచడం హర్షణీయం. ఈ పాఠశాల మోడల్‌గా తీసుకుని, అవకాశం ఉన్న ప్రతి చోట బృహత్ ప్రణాళిక ఏర్పాటు చేసి, మొక్కలను పెంచాలి. తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో చేపడుతున్న హరితహారంతో మున్సిపాలిటీలో మొక్కల శాతం పెరిగింది. వారికి కావాల్సిన సదుపాయాలు మున్సిపాలిటీ ద్వారా అందజేస్తున్నాం – కారంగుల రాజేశ్వర్‌రావు, తూంకుంట మున్సిపాలిటీ చైర్మన్
నగర విస్తరణ జరిగి, రోజు రోజుకు పచ్చదనం తరిగిపోతుంది. ఆక్సిజన్ స్థాయిలు పడిపోతున్నాయి. ఆక్సిజన్ శాతాన్ని పెంచి, వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న హరితహారానికి తోడు అర్బన్ ఫారెస్ట్ ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే లక్షా 20 వేల మొక్కలు నాటాం. ఆక్సిజన్ స్థాయిలు పెంచడంతో పాటు విద్యార్థులకు పోషకాహారం అందించే దిశగా పండ్ల మొక్కలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. – హరికృష్ణ, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్డీ