సిటీబ్యూరో/బేగంపేట్ జనవరి 28: హుస్సేన్ సాగర్‌లో పటాకుల పేలుడు ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఇందులో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఒకరు, అందులో గల్లంతైన మరొకరు అజయ్ మృతదేహం మంగళవారం బయటపడింది. ఈ ప్రమాదానికి కారణమైన బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై ఇప్పుడు పోలీసులు కేసు పెడుతారా? అరెస్ట్ చేస్తారా? అనే విషయాలు ఇప్పుడు నగరవాసులను ప్రశ్నిస్తోంది. మరో పక్క సోషల్‌మీడియాలో ఇవే ప్రశ్నలు నెట్జనులు ప్రభుత్వానికి వేస్తున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో ఆదివారం రాత్రి భారతమాత మహాహారతి వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుకలు పూర్తయిన తరువాత హుస్సేన్‌సాగర్ మధ్య లో టపాసులు కాల్చాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రెండు పడవల్లో భారీగా పటాకులు తీసుకొని హుస్సేన్‌సాగర్ మధ్యలోకి వెళ్లారు. రెండు పడవల్లో ఏడుగురు ఉన్నారు. హుస్సేన్‌సాగర్ మధ్యలో పడవలపై ఉంటూ టపాసులు కా ల్చుతుండగా నిప్పు రవ్వలు వచ్చి పడవలో ఉన్న టపాసులపై పడడంతో ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా టపాసులు పేలాయి. దీంతో రెండు పడవల్లో ఉన్న వారు ప్రమాదానికి గురయ్యారు. ఇందులో ముగ్గురికి గాయాలు కాగా, మరో నలుగురు సాగర్‌లోకి దూకి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు.
ఇందులో అజయ్ కూడా ఉన్నాడు. గాయాలపాలైన వారిలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన గణపతిని యశోద దవాఖానకు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే నాగారంకు చెందిన అజయ్ గల్లంతైన విషయం ఆలస్యంగా తెలవడంతో అతని కోసం సోమ, మంగళవారాలు గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం అజయ్ మృతదేహం హుస్సేన్‌సాగర్ నుంచి బయటకు తీశారు. అప్పటికే అతని కుటుంబ సభ్యులు హుస్సేన్‌సాగర్ వద్దకు వచ్చి అజయ్ ప్రాణాలతో బయటకు రావాలంటూ కోరుతూ ఎదురు చూశారు. మంగళవారం అతని మృతదేహం బయటపడిందని తెలుసుకొని కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. బుధవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని ఎస్సై హనుమంత్ తెలిపారు. ఇదిలాఉండగా మృతి చెందిన అజయ్, గణపతిలు ఒకొరికొకరు తెలిసినవాళ్లు. హుస్సేన్‌సాగర్ మధ్యలో టపాసులు కాల్చేందుకు వెళ్తున్న పడవల్లో ఆ దృశ్యాలను చూసేందుకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు సెక్రటేరియేట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
బాధ్యత ఎవరిదీ…?
ఇద్దరిని పొట్టన పెట్టుకున్న పడవల ప్రమాదానికి పోలీసులు ఎవరినీ కారకులు చేయనున్నారు అనేది ఇప్పుడు అందరిలో మెదలుతున్న ప్రశ్న. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగానే పడవల్లో వెళ్లి టపాసులు కాల్చారు. అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అనుమతులున్నా, హుస్సేన్‌సాగర్ మధ్యలో టపాసులు కాల్చేందుకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని పోలీసులు తెలిపారు. టపాసులు కాల్చేందుకు తమ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని సెంట్ర ల్ జోన్ డీసీపీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదానికి కారకులపై పోలీసులు కేసులు పెడుతారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. కాగా..సెంట్రల్ జోన్‌లోని సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో పుష్ప సినిమా హిరో అల్లు అర్జున్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసి చూపించారు. పడవల్లో జరిగిన ప్రమాదం ఘటనలో హైదరాబాద్ పోలీసులు ఎలా స్పందిస్తారోనని నగర ప్రజలు ఎదురు చూస్తున్నారు.