మాదాపూర్, జూన్ 8: ప్రసూతి సమయంలో అత్యంత క్లిష్టమైన సందర్భం ఎదురైనప్పుడు తల్లీబిడ్డలను క్షేమంగా ఎలా కాపాడాలనే విషయమై అవగాన కల్పించడమే లక్ష్యంగా ఆదివారం మాదాపూర్‌లోని యశోద హాస్పిటల్స్‌లో హై రిస్క్ ప్రెగ్నెన్సీ పై లైవ్ వర్క్‌షాప్‌తో పాటు జాతీయ కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ డైరెక్టర్, డాక్టర్ పవన్ గోరుకంటి విచ్చేసి యశోద హాస్పిటల్ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ కృష్ణవేణి నాయినితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా గోరుకంటి మాట్లాడుతూ… హై రిస్క్ ప్రెగ్నెన్సీ నిర్వహణలో ఇబ్బందులను ఏ విధంగా అధిగమించాలో ఈ వేదిక ద్వారా అవగాహన కల్పించినట్లు తెలిపారు. విభిన్న వైద్య విభాగల నుంచి అనుభవజ్ఞులైన ప్రముఖ వైద్య నిపుణులు హై రిస్క్ ప్రెగ్నెన్సీ నిర్వహణలో ఇబ్బందులను అధిగమిస్తూ, నూతన మార్గదర్శకాలు ఆధునిక సాంకేతికతను ఉపయోగించి సంక్లిష్టమైన శస్త్ర చికిత్సలను మరింత సులభంగా, కచ్చితత్వంతో ఎలా నిర్వహించాలో వారి అనుభవాలను ఈ జాతీయ సదస్సులో పంచుకున్నారని తెలిపారు.
ఇలాంటి లైవ్ వర్క్ షాపులు యువ వైద్యులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. యశోద హాస్పిటల్ సీనియర్ గైనకాలజిస్ట్, డాక్టర్ కృష్ణవేణి నాయిని మాట్లాడుతూ.. ఈ అంతర్జాతీయ కాన్ఫరెన్స్, లైవ్ వర్క్ షాప్‌లో హైరిస్క్ ప్రెగ్నెన్సీలో క్లిష్టమైన అంశాలపై లోతైన చర్చ జరిగిందని తెలిపారు. ఇందులో 500 మందికి పైగా గైనకాలజిస్ట్లు, సర్జన్ల తో పాటు యశోద హాస్పిటల్స్ వైద్య నిపుణులు తదితరులు పాల్గొన్నారు.