ఖైరతాబాద్, జనవరి 27 : తమ ప్లాట్లను కబ్జా చేసి వాటిని విక్రయిస్తూ తమపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఏకశిలానగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వాపోయారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు జుబేర్ అక్రమ్, రామ్ రెడ్డి, చెరుకు శివారెడ్డి, ముత్తారెడ్డిలు తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం కొర్రెముల గ్రామంలో 1985 సర్వే నం. 739 నుంచి 749లోని సుమారు 2,086 ప్లాట్లను వివిధ శాఖల్లో ఉద్యోగాలు చేస్తున్న సిబ్బంది సొంత డబ్బులు, రుణాల ద్వారా కొనుగోలు చేశారన్నారు. అందులో కొందరు ఇండ్లను సైతం నిర్మించుకున్నారన్నారు.
మరికొందరు నాడు అభివృద్ధి చెందని కారణంగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదన్నారు. 2005లో హర్ష కన్స్ట్రక్షన్స్కు చెందిన ఎ. వెంకటేశ్ తమ ప్లాట్లను వ్యవసాయ భూమిగా చూపిస్తూ తమకు ప్లాట్లను విక్రయించిన వారి వద్ద నుంచి కొనుగోలు చేసినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి కబ్జా చేశాడని వెల్లడించారు. అంతేకాకుండా అవే పత్రాలపై రూ.40కోట్ల రుణాలు కూడా తీసుకున్నారని చెప్పారు. 2006లో డీపీవోతో తమ లేవుట్లను రద్దు చేయించారని తెలిపారు. సకాలంలో వడ్డీలు చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు అక్కడికి వచ్చి విచారణ చేయగా, ఆ విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.
2008లో హైకోర్టును ఆశ్రయించగా, తమకు అనుకూలంగా తీర్పునిచ్చిందని, దీంతో వారి మ్యుటేషన్‌ను రద్దు చేశారని వెల్లడించారు. కొందరు ఆ ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ సైతం కడుతూనే ఉన్నారని, మరికొందరికి ఇంటి అనుతమతులు కూడా వచ్చాయన్నారు. తాజాగా మళ్లీ కొందరు కబ్జాదారులతో కలిసి తమ ప్లాట్లను కబ్జా చేశారని, తమ స్థలాల వద్దకు తాము వెళ్లకుండా రౌడీలను పెట్టి దౌర్జన్యం చేస్తున్నారని వాపోయారు. ప్రభుత్వం స్పందించి తమకు రక్షణ కల్పించి, న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో శ్రీనివాస్, నిర్మల,రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.