హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో నకిలీ వర్సిటీల్లేవని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ మామిడాల జగదీశ్‌కుమార్ ప్రకటించారు. ఇటీవలే దేశవ్యాప్తంగా 21 ఫేక్ వర్సిటీల జాబితాను విడుదల చేశామని తెలిపారు. ఏపీ, పుదుచ్చేరి, ఒడిశా, యూపీ, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక రాష్ర్టాల్లో ఫేక్ వర్సిటీలున్నట్టు గుర్తించామని చెప్పారు. శనివారం ఆన్లైన్లో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. ఫేక్ వర్సిటీలు అంటే ఏమిటి? వాటిపై ఎలాం టి చర్యలు తీసుకొంటున్నామో వెల్లడించారు.
ఇలా అయితేనే చెల్లుబాటు
యూజీసీ యాక్ట్ 1956 సెక్షన్ 2 (ఎఫ్) వర్సిటీ అంటే ఏమిటో నిర్వచించింది. సెంట్రల్ యాక్ట్ లేదా ప్రొవిన్షియల్ యాక్ట్ లేదా స్టేట్ యాక్ట్ ప్రకారం స్థాపించిన, విలీనమైన విద్యాసంస్థలే యూనివర్సిటీలు. వర్సిటీలను ఏర్పా టుపై గెజిట్ విడుదలై ఉండాలి. ఇలాంటి వి ద్యాసంస్థల డిగ్రీలే చెల్లుబాటవుతాయి.
ప్రత్యేకంగా సెల్..
నకిలీ వర్సిటీల, డి గ్రీల ముప్పును అరికట్టేందుకు 1996 నుంచి యూజీసీలో యాంటీ మాల్‌ప్రాక్టీస్ సెల్ (ఏఎంపీసీ) పనిచేస్తున్నది. యూజీసీ యాక్ట్ -1956కి విరుద్ధంగా పనిచేస్తున్న, నకిలీ, గుర్తింపులేని వర్సిటీలు, సంస్థలను అడ్డుకోవడం, తనిఖీలు చేయడం, వాటి బెడదను నివారించడమే లక్ష్యంగా ఏఎంపీసీ పని చేస్తున్నది.
తీసుకొనే చర్యలివే..
చెల్లని డిగ్రీలను ప్రదానం చేస్తున్న నకిలీ విద్యాసంస్థలు, వర్సిటీలకు షోకాజ్, వార్నింగ్ నోటీసులు జారీచేస్తాం. అనుమానిత విద్యాసంస్థల పేర్లను యూజీసీకి తెలపాలంటూ రాష్ట్రాలకు లేఖలు రాస్తున్నాం.
సమాచారం ఇవ్వండి..
నకిలీ విద్యాసంస్థలు, డిగ్రీలపై ఎవరైనా https://www.ugc.ac.in/ page/fake -universities.aspx ద్వారా సమాచారం ఇవ్వాలి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 21 ఫేక్ వర్సిటీలున్నట్టుగా గుర్తించి, వాటి పేర్లను వెల్లడించాము.