సిటీబ్యూరో, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఏటీఎం యంత్రంలో కార్డు పెట్టి క్యాష్ తీసుకుంటూ.. సాంకేతిక లోపాలు సూచించి బ్యాంకుల నుంచి తిరిగి తమ ఖాతాల్లో డబ్బులు డిపాజిట్ చేయించుకుంటున్న ఓ ముఠాను ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 24 ఏటీఎం కార్డులు, రూ.4.68 లక్షల నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. అదనపు సీపీ విక్రమ్‌సింగ్ మానన్, టాస్క్‌ఫోర్స్ డీసీపీ(ఓఎస్డీ) రాధాకిషన్‌రావుతో కలిసి వివరాలను వెల్లడించారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సైద్ ఉర్ రహమాన్ ముంబైలో ఉంటూ అరబిక్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. 2020లో చందానగర్‌లో నివాసమున్న సమయంలో అతడికి జవహర్‌నగర్‌కు చెందిన మహ్మద్ సాను, షేక్ మహబూబ్తో పరిచయం ఏర్పడింది.
ఈ ముగ్గురు కలిసి హైదరాబాద్‌తో పాటు ముంబైలో ఏటీఎం కేంద్రాలను ఎంచుకొని మోసాలకు పాల్పడుతున్నారని నిర్ధారించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. దోచుకున్న డబ్బుతో రహమాన్ తానే జిల్లాలో 300 గజాల ప్లాట్ కొనుగోలు చేయడమే కాకుండా తల్లికి క్యాన్సర్ చికిత్స చేయించాడు. రూ. 4 లక్షలు బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టి, బంగారు గాజులు కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడించాడు. ఈ ముఠాపై హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఐదు కేసులున్నాయి. ఈ ముఠాను తదుపరి విచారణ నిమిత్తం మారేడ్‌పల్లి పోలీసులకు అప్పగించారు. నిందితుల నుంచి 24 ఏటీఎం కార్డులు, రూ. 4.68 లక్షల విలువైన నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఏటీఎంలో కార్డు పెట్టి క్యాష్ డ్రా చేసే ప్రక్రియ నిర్వహిస్తారు. క్యాష్ బయటకు వస్తున్న క్షణంలో ఒక చేతితో నగదు పట్టుకొని.. మరో చేతితో కీ బోర్డుపై ఉండే క్యాన్సల్, ఎంటర్ కీలను నొక్కేస్తారు. దీంతో క్యాష్ చేతికొస్తుంది. రశీదులో మాత్రం ట్రాన్సాక్షన్ ఎర్రర్ అంటూ వస్తుంది. ఆ తర్వాత సదరు వ్యక్తి బ్యాంకుకు ఫిర్యాదు చేసి.. తనకు డబ్బు రాలేదు.. ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యిందని.. తన ఖాతా లోనుంచి డబ్బు డెబిట్ అయ్యిందంటూ బ్యాంకు కస్టమర్ కేర్‌కు ఫోన్ చేస్తాడు. రికార్డులో కూడా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అని ఉండటంతో బ్యాంకు నుంచి 6 నుంచి 7 పని దినాల్లో సదరు ఖాతాదారుడి ఖాతాలోకి డబ్బు తిరిగి వచ్చేస్తున్నది.. ఇలా వరుసగా మారేడ్‌పల్లిలోని ఏటీఎం ద్వారా మోసాలు జరుగుతుండటంతో గత నెల 10వ తేదీన వెస్ట్‌మారేడ్‌పల్లి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి ఈ మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.