జలమండలిలో ట్యాంకర్స్ అసోసియేషన్ ప్రతినిధుల ఇష్టారాజ్యం నడుస్తున్నది. ఉన్నతాధికారుల నుంచి అటెండర్ల దాకా వారిని చూస్తే బెంబేలెత్తిపోతున్నారు. మేనేజింగ్ డైరెక్టర్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ కంటే ట్యాంకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అంటేనే అందరికీ హడల్. అటు ట్యాంకర్స్ ఓనర్లు సైతం వారి పేరు చెబితే వణకిపోతున్నారు. జలమండలి పరిధిలో కొత్తగా ట్యాంకర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా, దాన్ని నడపాలన్నా అధికారుల కంటే ముందుగా అసోసియేషన్ ప్రతినిధులను కలవాలి. ప్రాంతాన్ని బట్టి రూ.50 వేల నుంచి రూ.1లక్ష సమర్పించుకోవాల్సిందే. ఎందుకివ్వాలని ప్రశ్నిస్తే.. ట్యాంకర్‌కు అనుమతులు ఆగిపోతున్నాయి.
– సిటీబ్యూరో, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): ట్యాంకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అటు అధికారులను, ట్యాం కర్స్ ఓనర్స్‌ను తమ గుత్తాధిపత్యంలో ఉంచుకుని జలమండలిని భ్రష్టు పట్టిస్తున్నారు. ఇదేమిటని అధికారులను ప్రశ్నిస్తే మౌనం రూపంలో సమాధానమిస్తున్నారు. బోర్డు లో ఏండ్ల తరబడిగా వారి హవా నడుస్తున్నా ఏ అధికారి ఇప్పటిదాకా చర్యలు తీసుకోకపోవడం విస్తుగొలుపుతున్నది. ఎవరైనా అసోసియేషన్ ‘పెద్ద’పై ఫిర్యాదు చేస్తే.. చర్యలు తీసుకోపోగా మరుసటి రోజే ఫిర్యాదుదారులకు బెదిరింపుల పరంపర కొనసాగుతున్నది. చర్యలు తీసుకోవాల్సిన అధికారి వద్దకు చేరకుండానే ఫిర్యాదు పత్రం మాయమవుతున్నది. ఒకవేళ ఉన్నతాధికారి వద్దకు చేరుకున్నా దాన్ని చెత్తబుట్టలో పడేస్తున్నా రు. అసోసియేషన్ పెద్ద ట్యాంకర్స్ మాత్ర మే కాకుండా ఇతర బిల్లులు మంజూరుకు పైరవీలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
గడిచిన మూడేండ్లలో అసోసియేషన్ ‘పెద్ద’ ఒక్కో ఏడాదికి పదుల సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. ఉన్నతాధికారులు ఫిర్యాదుపై ఎంక్వైరీ చేయాలని సూచించినా ఏం చర్యలు తీసుకున్నారో.. కనీసం విచారణ చేపట్టినట్లు ఉన్నతాధికారులకు సమాధానం కూడా ఇవ్వడంలేదు. గతంలో ట్యాంక ర్స్ బాధ్యతలు నిర్వర్తించిన రెవెన్యూ విభాగంలో కిందిస్థాయి నుంచి ఉన్నతాధికారుల దాకా మూడేండ్లలో ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని చెప్తున్నారు. ట్యాంకర్స్ వ్యవస్థను డీ సెంట్రలైజ్ చేసి ఈడీలకు అప్పగించినా వాళ్లు అదేదారిలో పయనిస్తున్నారు.
గతేడాది కొంతమంది ట్యాంకర్స్ యజమానులు తమ నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని జేఎండీకి ఫిర్యాదు చేశా రు. దానిపై విచారణ చేపట్టాలని పాల నా విభాగానికి సూచించారు. ఏడాది దాటినా ఇప్పటి వరకు ఎలాంటి విచారణ చేపట్టలేదు. దానిపై ఎం విచారణ చేశారు? జేఎండీకి సమాధానం ఇచ్చా రా? అని ప్రశ్నిస్తే.. జేఎండీ పంపించిన ఫిర్యాదు కాపీ తమ దగ్గర లేదని సమాధానం ఇస్తున్నారు. అసోసియేషన్ పెద్ద చెప్పినట్లుగా నడుచుకోకపోవడంతో గతంలో ఇద్దరు సిబ్బందిని పక్కా ప్రణాళికతో ఏసీబీకి పట్టించారని ట్యాంకర్స్ యజమానులు చెప్తున్నారు.
కొంతమంది ఉన్నతాధికారుల వ్యక్తిగత వ్యవహారాల్లో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఏ అధికారి తనకు సహకరించకున్నా అవినీతి ఆరోపణలు చేస్తూ బోర్డులో చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఉద్యోగ భద్రత పేరిట భయపడుతూ చర్యలు తీసుకోవడం లేదని ట్యాంకర్స్ యజమానులు చెప్తున్నారు.