సికింద్రాబాద్/మారేడ్‌పల్లి, జనవరి 18: రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని గురువారం సికింద్రాబాద్‌లో డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, కంటోన్మెంట్లో ఎమ్మెల్యే సాయన్నలు లాంఛనంగా ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్, కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో విజయవంతంగా నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సిద్ధంగా ఉన్నారు. మొదటి విడుతలో విజయవంతంగా పూర్తి చేయగా అదే స్థాయిలో రెండో విడుతలో నిర్వహించేందుకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతలు పలు సూచనలు చేశారు. కంటి సమస్యతో బాధపడుతున్న వారికి కంటి పరీక్షలు నిర్వహించి కావాల్సిన కళ్లజోళ్లు, మందులు అందించడానికి, ఆపరేషన్లు చేయించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సికింద్రాబాద్ పరిధిలోని ఐదు డివిజన్లలో 9 కేంద్రాలు ఏర్పాటు చేయగా, కంటోన్మెంట్ పరిధిలోని ఎనిమిది వార్డుల్లో 6 శిబిరాలు నిర్వహించనున్నారు. 42 బృందాలను ఏర్పా టు చేయగా ఆయా ప్రాంతాల్లో సేవలు అందిస్తాయి.
సద్వినియోగం చేసుకోవాలి
కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమ ఆహ్వాన పత్రికను పికెట్ డిస్పెన్సరీ వైద్యుడు విశాల్ వాసవీనగర్‌లోని తన కార్యాలయంలో ప్రముఖ సామాజిక కార్యకర్త తేలుకుంట సతీష్ గుప్తకు అందజేశారు.
కాకాగూడ బస్తీలో…
కాకాగూడ అంబేద్కర్‌నగర్ కమ్యూనిటీహాల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు రావుల సతీష్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విశాల్, ఆశ వర్కర్లు, ఆర్పీలు, స్థానిక నాయకులు శ్రీనివాస్, నరేష్, సతీష్, ఊర్మిళ, లలితా పాల్గొన్నారు.
కంటి వెలుగు కేంద్రాల పరిశీలన
సికింద్రాబాద్ పరిధిలోని తార్నాక డివిజన్ పరిధిలోని ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియం, నాగార్జున నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద కంటి వెలుగు కార్యక్రమ ఏర్పాట్లను గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కంటి వెలుగును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ మేయర్ కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంహెచ్ఓ డాక్టర్ రవీందర్ గౌడ్, ఎస్పీహెచ్ఓ డాక్టర్ సక్కుబాయి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సౌషీర్య, ఇన్చార్జి మల్లేష్, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.