సిటీబ్యూరో, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): ఎన్నికలలో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులది కీలకపాత్ర అని.. తమ విధులు, బాధ్యతలపై పూర్తి అవగాహన పెంచుకుని ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కోరారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో షేక్‌పేట జీ నారాయణమ్మ ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు రెండో విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రెండు విడతలుగా జరిగిన ఈ శిక్షణ కార్యక్రమానికి 500 మంది అధికారులు హాజరయ్యారు. శిక్షణ కార్యక్రమానికి హాజరైన ఎన్నికల పోలీస్ పరిశీలకులు ఓం ప్రకాశ్ త్రిపాఠి, వ్యయ పరిశీలకులు సంజీవ్‌కుమార్ లాల్ శిక్షణ జరుగుతున్న తీరును పరిశీలించారు.
విధులను సీరియస్‌గా తీసుకోవాలి..
ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ రోజు ముఖ్యమైనదని, పోలింగ్ దృష్ట్యా చేయాల్సిన అన్ని అంశాలపై ఎన్నికల సంఘం రూపొందించిన హ్యాండ్‌బుక్‌ను ప్రతి పీవో, ఏవో తప్పకుండా చదవడమే కాకుండా అందులోని అన్ని నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఎన్నికల విధులను సీరియస్‌గా తీసుకోవాలని చెప్పారు.కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను నిక్కచ్చిగా పాటిస్తూ.. పోలింగ్ సజావుగా జరిగేలా ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు పనిచేయాలని ఎన్నికల పోలీస్ పరిశీలకులు ఓం ప్రకాశ్ త్రిపాఠి, వ్యయ పరిశీలకులు సంజీవ్ కుమార్‌లాల్ తెలిపారు. కార్యక్రమంలోశిక్షణ కార్యక్రమాల బాధ్యులు సునంద, మమత పాల్గొన్నారు.