దుండిగల్, మే 14 : ఓ బంగారం దుకాణం యజమాని ఘరానా మోసానికి పాల్పడిన సం ఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం ప్రకారం.. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, ప్రగతినగర్‌లో చేతన్ జ్యువెలరీ పేరుతో గత 15 ఏండ్ల నుంచి నితీశ్ జైన్ అనే వ్యక్తి బంగారం దుకాణం నిర్వహిస్తున్నాడు. ప్రగతినగర్తోపాటు కూకట్‌పల్లిలోని కేపీహెచ్‌బీ కాలనీలో చేతన్ జ్యువెలరీ పేరుతో మరో దుకాణం నిర్వహిస్తున్నాడు. ఎన్నో ఏండ్లుగా జ్యువెలరీ వ్యాపారం చేస్తూ ఆకర్షణీయమైన స్కీములతో ప్రజల వద్ద పెద్ద మొత్తంలోనే వసూలు చేసినట్లు తెలుస్తున్నది. అదే సమయంలో నగలు కుదువబెట్టుకుని వడ్డీకి డబ్బులు ఇచ్చేవాడు.
ఈ క్రమంలో చేతన్ జ్యువెలరీ యజమాని నితీశ్ జైన్ గత వారం రోజుల నుంచి షాప్ మూసివేసి సుమారు రూ.10కోట్ల విలువ గల బంగారు నగలతోపాటు స్కీముల పేరుతో వసూ లు చేసిన నగదుతో పరారైనట్లు సమాచారం. దీంతో దుకాణంలో నగలు తాకట్టు పెట్టిన ప్రజ లు ప్రతిరోజూ జ్యువెలరీ దుకాణం ఓపెన్ చేస్తాడేమోనని వచ్చిపోతూ అతడికి ఫోన్ చేస్తుండేవారు. ఎంత చేసినా స్పందించకపోవడంతో కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇదే విషయంపై బాచుపల్లి ఇన్స్పెక్టర్ ఉపేందర్‌ను వివరణ కోరగా.. చేతన్ జ్యువెలరీ దుకాణంపై పోలీస్‌స్టేషన్‌లో ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపా రు. ఎవరైనా బాధితులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామన్నారు.